Political Leaders on AP Wine Shop Tenders : ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సర్కార్ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొందరైతే తాము రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని, అయినా తమకు వాటా ఇవ్వాలని, దానికి అంగీకరిస్తేనే అర్జీ చేసుకోవచ్చని అంటున్నారు.
కొందరు ప్రజాప్రతినిధులు నేరుగానే మద్యం వ్యాపారులకు ఆదేశాలిస్తున్నారు. మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు. తమను కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే ఆ తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాల లైసెన్సులకు ఆశించిన స్థాయిలో అర్జీలు రావడం లేదు.
961 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు : ఆంధ్రప్రదేశ్‌లోని 961 మద్యం దుకాణాలకు ఇప్పటివరకూ ఒక్క అర్జీ కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోని 133 దుకాణాలకు దరఖాస్తులేవీ రాలేదు. నెల్లూరులో 84, కాకినాడలో 58, ప్రకాశంలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు.
ఒడిశా సరిహద్దుల్లో దరఖాస్తులు వేయొద్దని హుకుం :
- శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దుల్లోని ఓ నియోజకవర్గంలోని దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దని కీలక నాయకుడి తరఫున మద్యం వ్యాపారులకు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే తండ్రి దుకాణాలన్నింటికీ దరఖాస్తులు వేస్తారని ఆయనకే అవి వదిలేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తమ కోసమే ఈ పాలసీ వచ్చిందని బహిరంగంగానే చెబుతున్నారు.
- శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధులు ఇటీవల విశాఖపట్నంలో మద్యం వ్యాపారులతో భేటీ అయ్యారు. వారి నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాల కోసం ఎవరూ దరఖాస్తు వేయొద్దని హెచ్చరించారు. ఇదే జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్న మరో కీలక నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు కొన్ని దుకాణాలను తమకు వదిలేసి మిగతా వాటికే దరఖాస్తులు చేసుకోవాలని మద్యం వ్యాపారులకు చెప్పారు.
పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో సొమ్ము చెల్లిస్తేనే :
- పల్నాడు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో షాప్‌కి ఇంత చొప్పున తమకు సొమ్ము చెల్లించాలని, తర్వాత దుకాణంలో వాటా ఇవ్వాలని ముఖ్యనేత కుమారుడు చెబుతున్నట్లు తెలుస్తోంది.
- గుంటూరుకు సమీపంలోని ఓ నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
- గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో మూడు నియోజకవర్గాలు మినహా మిగతా అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది.