Software Engineer Committed Suicide by Buying Poison Online : కుటుంబంలో గొడవల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఐదు నెలల క్రితం అదే జిల్లా ముసునూరు మండలం తోచిలుకకు చెందిన యువకుడితో వివాహం అయింది. అతను కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు.
వీరు మియాపూర్‌లోని గోకుల్‌ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయి. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన మహిళ గత నెల 26న ఆన్‌లైన్‌లో విష పదార్థాలను ఆర్డర్ చేసి తెప్పించుకుంది. బుధవారం విషం తాగడం గమనించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీలోని ఏ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురువారం వివాహిత మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల కారణంగా తన కుమార్తె మరణించిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.