Social Media Influencers Promoting Online Gaming and Betting :సోషల్ మీడియాలో ప్రభావశీల వ్యక్తుల పేరుతో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వత్తాసు పలుకుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ట్రేడింగ్ తదితర యాప్‌లకు ప్రచారం చేస్తూఅమాయక ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ట్రంలో వీటిపై నిషేధమున్నా అవేవీ పట్టనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గ్యాంబ్లింగ్‌కు అలవాటుపడి వేలాది మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
చట్టప్రకారం చర్యలు :ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చలేక వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటి కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే కొందర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. గ్యాబ్లింగ్‌ను ప్రోత్సహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. కొన్ని నెలలుగా గేమింగ్, డేటింగ్ యాప్‌లపై సామాజిక మాధ్యమాల్లో ప్రచార వీడియోలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరహా వీడియోల్ని తమ దృష్టికి తీసుకొస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ప్రజలపై ఎంతో కొంత ప్రభావం :ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, రీల్స్ చేస్తూ వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. ఈ వీడియోలు వేర్వేరు ఖాతాల ద్వారా కొన్ని లక్షల మందికి చేరుతుంటాయి. ఇలా ఎక్కువ మంది ఫాలోవర్లు, ప్రజలపై ఎంతోకొంత ప్రభావం చూపే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించేందుకు అనేక సంస్థలు పోటీపడుతుంటాయి. దీన్ని బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉండే సైబర్ ముఠాలు కొన్ని నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్లు సృష్టించి ఇన్‌ఫ్లుయోన్సర్లతో ప్రచారం చేయిస్తున్నారు.