Smart Phone Effects on Children : మొబైల్ ఫోన్లలో గేమ్స్, ల్యాప్‌టాప్‌లో వీడియోలు చూస్తున్న పిల్లలకు కళ్లతో పాటు వారి పద సంపద దెబ్బతింటోంది. దీని వల్ల పిల్లలు సహజ రంగులు గుర్తించకపోవడంతో పాటు గలగల మాట్లాడే చిన్నారులు సైతం మాట్లాడటంలో వెనుకబడుతున్నారు. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన సురేశ్ రెండేళ్ల వయసులో గలగల మాట్లాడుతూ అందరిని ఆకట్టుకునేవాడు. కానీ తర్వాత ఎవరితోనూ మాట్లడకపోవడం, పలుకుల్లో వెనుకబాటు ఉండడం, బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో బాబును వైద్యులకు చూపిస్తే స్మార్ట్‌ఫోన్ ప్రభావమే దీనికి కారణమని గుర్తించారు.
తణుకులోని ఓ మహిళ వస్త్ర వ్యాపారం ప్రారంభించగా తన మూడేళ్ల బాలుడికి ఫోన్ ఇచ్చి పనిలో నిమగ్నమయ్యేవారు. బాలుడు పెరిగే కొద్దీ మాటలు రాకపోవడంతో వైద్యులకు చూపించారు. ప్రస్తుతం బాబుకి స్పీచ్‌థెరపీ చేయిస్తున్నారు. గతంలో ఇంట్లోని అమ్మమ్మ, నాయనమ్మలు చిన్నపిల్లలతో ముచ్చట్లు పెట్టి మాటలు నేర్పటం చూసేవాళ్లం. ప్రస్తుతం తల్లిదండ్రులు బిజీబిజీగా ఉండటం పిల్లలకు ఫోన్లు ఇచ్చి తమ పనిలో నిమగ్నమవుతున్నారు. దీని వల్ల పిల్లలు ఫోన్‌కు అలవాటు పడడంతో భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయి. ఫోన్‌ను ఎక్కువగా వాడే పిల్లల్లో పద సంపద తక్కువ ఉందని వైద్యులు చెప్పారు.
కారణాలు అనేకం :పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పనిలో ఉన్నారని, ఫోన్ చూపిస్తే తింటారని, ఫోన్ ఇస్తే కుదురుగా ఒకచోటు కూర్చుంటారని ఇలా ఇతర కారణలతోనూ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు. దీంతో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడి మాట్లాడటం లేదు. తల్లిదండ్రులకు పిల్లల మధ్య సంభాషణ ఉండటం లేదు. ఏపీలో భీమవరంలోని మూడేళ్ల బాబు మాతృభాష కాకుండా ఏదో తెలియని పదాలు పలికేవాడు. మొదట ఆ బాబు తల్లిదండ్రులు సరదాగా తీసుకున్నా తర్వాత పదాలు రావడంలేదని, పలకడంలేదని గుర్తించారు. దీంతో వైద్యులను సంప్రదించారు.