Skill Sprint Internship Program in Young India Skill University :విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ-వర్క్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో 'స్కిల్ స్ప్రింట్' పేరిట ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను సచివాలయంలో గురువారం మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణను నైపుణ్య మానవ వసరులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
‘స్కిల్ స్ప్రింట్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం వ్యవధి 90 రోజులని అందులో భాగంగా ఇంజినీరింగ్, రోబోటిక్స్, మేనేజ్‌మెంట్, సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. టీ-వర్క్స్‌లోని అధునాతన సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవావని సూచించారు. సొంతంగా ప్రాజెక్టులను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ద్వారా అకాడమిక్ క్రెడిట్స్ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.