ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తిక మాసం శ్రవణ నక్షత్రం - ఈ రోజు దీపారాధన చేస్తే కలిగే ఫలితమిదే!

శతకోటి జన్మల పాపాలను పోగొట్టే కోటి సోమవారం

KOTI_SOMAVARAM_2024
KOTI_SOMAVARAM_2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2024, 9:54 AM IST

Significance Of Koti Somavaram 2024 And Karthika Masam :తెలుగు సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్తిక మాసం ఎంతో విశిష్టత కలిగినది. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసం అంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. శివకేశవ ఆరాధన అంటే- మనం చరించే ‘స్థితిగతి’ సవ్యంగానూ, ఆచరించే ప్రతీ కర్మ శుభాలనిచ్చేదిగానూ ఉండాలన్న దానికి ప్రతీకగా కార్తిక మాసాన్ని చెబుతారు. కార్తిక మాసం అందునా శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన వారాన్ని కోటి సోమవారంగా (నవంబరు 9) వ్యవహరిస్తారని ప్రవచన కర్త గోర్తి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి తెలియజేశారు. ఆ రోజు దీపారాధన చేస్తే కలిగే ఫలితాన్ని భక్తులకు వివరించారు.

సకల పాపాలను తొలగించే 'నారాయణ' నామస్మరణ- ఈ మహిమాన్విత మంత్ర మహత్యం ఇదే!

కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి :కార్తిక మాసంతో సమానమైన మాసం లేదు. శివకేశవ అభేదమైన తత్వమే ఈ మాసం. కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కలిగిన మాసం కావడం వల్ల కూడా దీనికి కార్తీక మాసమని పేరు వచ్చింది. స్నానం, దీపం, దానం, అభిషేకం, ఉపవాసం వంటివి ఈ మాసంలో ఆచరిస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. నిత్యం స్నానం, దీపారాధన అందరూ చేస్తుంటారు. దానికీ కార్తిక మాసంలో చేసే దీప ఆరాధనకు వ్యత్యాసం ఉంది. సాక్షాత్తూ పరమేశ్వరుని తత్వమే దీపారాధన అంతరార్థం. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడి తత్వం కలిగి దీపాన్ని వెలిగించడం దీని వెనుకున్న అంతరార్థమని పండితులు తెలియజేస్తున్నారు.

నక్షత్రం దర్శనం చేసుకుని :దీపానికి ఆధారం బ్రహ్మ. దానిలో వేసే వత్తి ఈశ్వర స్వరూపం. అందులో వేసే నూనె/నెయ్యి సాక్షాత్తూ విష్ణు స్వరూపం. ఆ దీపాన్ని వెలిగించే శక్తి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటుంది కనుక అందుకే ఆయన కార్తికేయుడు అయ్యాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. కృత్తిక నక్షత్రంలో ఉద్భవించిన మహానుభావుడాయన. ఈ మాసంలో నక్షత్రం దర్శనం చేసుకుని స్నానం ఆచరించాలని శివ మహాపురాణం చెబుతోంది. నిత్యం తెల్లవారుజామున ఆకాశంలో చుక్క ఉండగా స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

శత్రుభయం తొలగించే 'కార్తవీర్యార్జునుడి' స్తోత్రం- ఇది చదివితే పోగొట్టుకున్నవి మళ్లీ పొందుతారు!

కోటి సోమ‌వార విశిష్టత :అంతేకాదు, ఈ మాసానికి దామోదర మాసం (Damodara masam) అని కూడా పేరుంది. ఎవరికైనా దానం చేస్తున్నప్పుడు ‘కార్తిక దామోదర ప్రీతయే’ అంటారు. శివ-కేశవులకు భేదం చూపిస్తే సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారని శ్రీ మహా విష్ణువు తన కింకరులతో చెప్పినట్లు శివ పురాణం చెబుతోంది. ఈ సారి నవంబరు 9న వచ్చిన శనివారాన్ని కోటి సోమవారంగా (Koti Somavaram) వ్యవహరిస్తారు. కార్తిక మాసంలో ఏ వారమైతే శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటుందో దానికి కోటి సోమవారం (Koti Somavaram) అని పేరు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం. ఇలాంటి రోజు రావాలంటే చాలా అరుదు. ఈ రోజు ఉదయాన్నే దీప ఆరాధాన చేస్తే, మనకు తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే పాపం పోతుంది. కోటి శివ లింగాలను పూజించిన ఫలితం కలుగుతుంది

నవంబరు 13న క్షీరాబ్ది ద్వాదశి, కైశిక (చిల్కు) ద్వాదశి, చాతుర్మాస్య వ్రత సమాప్తి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు. మధ్యలో వచ్చే పరివర్తన ఏకాదశిరోజు మరోవైపు తిరుగుతాడు. ఈ కార్తిక మాసంలో ఏకాదశినాడు స్వామి వారు నిద్రలేస్తారు. చాతుర్మాస్య దీక్ష (Chaturmasya Deeksha) (ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ) చేసిన వారు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి దీపం వెలిగిస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది- గోర్తి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

కార్తిక దీపం ఆ మూడు ప్రాంతాల్లో వెలిగించాలి - అవేంటో మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details