SIB Ex DSP Praneeth Rao Case Updates :ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు, ప్రణీత్‌రావును కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఎస్ఐబీ(SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరారు. ఈ విచారణలో కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని నిందితులు తరపు న్యాయవాదులు నిన్న కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
PhoneTapping Case Updates :ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం కస్టడీ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావును ఇప్పటికే ఓసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టారు. ఇప్పుడు నిందితులందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని భావించిన పోలీసులు, అదనపు ఎస్పీలు సహా ప్రణీత్ రావు కస్టడీ కోసం పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు, పనిలో పనిగా ఫోన్ ట్యాపింగ్‌ను తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బడా వ్యాపారవేత్తలు, హవాలా దందా చేసే వారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను అయిదు రోజుల కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఉపయోగించారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం.