Shirdi Dwarkamai old Age Home Founder Srinivas Died : ఈ రోజుల్లో నలుగురు కుటుంబ సభ్యులున్న మధ్యతరగతి సంసారాన్ని ఈదడమంటేనే గగనం. అలాంటిది దాదాపు 500 మందిని అదీ కూడా ఎవరి పని వాళ్లు చేసుకోవడం చేతకాని అభాగ్య వృద్ధుల్ని చూసుకోవడం అంటే మాటలు కాదు. కానీ శ్రీనివాస్- సుధారాణి దంపతులు రెండు దశాబ్దాలుగా చేస్తున్నది అదే. అలాంటి వాళ్లందర్నీ అక్కున చేర్చుకున్న షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు శ్రీనివాస్ ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీనివాస్ మృతితో వృద్ధాశ్రమంలో ఉన్న వందలాది మంది శోకసముద్రంలో మునిగిపోయారు.
షిర్డీ ఆలయంపై టోర్నా ప్రతిష్ఠాపన- ఘనంగా మరాఠీ నూతన సంవత్సర వేడుకలు - Marathi New Year Celebrations
వృద్ధులు, వికలాంగులకు ఆరాధ్య దైవం : శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచి సాయిబాబా భక్తుడైన శ్రీనివాస్ చదువు, ఉద్యోగం గురించి ఏనాడూ ఆలోచించలేదు. భక్తిలో నిమగ్నమై విజయవాడ నుంచి వెళ్లి హైదరాబాద్‌లోని మల్లాపూర్ సాయిబాబా గుడిలో పని చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో పిల్లలు నిర్లక్ష్యం చేసిన వృద్ధులు తరచూ బాబా గుడికి వెళ్లేవారు. నిత్యం అక్కడే ఉండే శ్రీనివాస్‌తో తమ కష్టాలు చెప్పుకుని బాధపడేవారు. కొందరైతే తమకి కూడా అక్కడే ఆశ్రయం కల్పించమని వేడుకునేవారు. వాళ్ల బాధల్ని విని ఎంతో బాధపడేవాడు. అందుకోసం ఏం చేయాలో తెలిసేది కాదు. అలాగని వాళ్లని తనతోపాటే గుడిలో ఉంచడం కూడా సాధ్యం కాదు కదా అని ఆలోచించిన శ్రీనివాస్ క్రమంగా అలాంటి వాళ్లను బాగా చూసుకోవాలనే నిర్ణయానికొచ్చేశాడు. పైగా షిర్డీలోనే ఆ సేవ చేయాలని భావించాడు. దీనికి శ్రీనివాస్ తమ్ముడు రామ్‌మోహన్, కొందరు సాయి భక్తులు అండగా నిలబడ్డారు. వారి సహకారంతో శ్రీనివాస్ షిర్డీలో ఎకరం స్థలం కొన్నాడు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 500 మంది వృద్ధులు, వికలాంగులు ఈ వృద్ధాశ్రమంలో సాంత్వన పొందుతున్నారు.
అభాగ్యులకు సేవ చేస్తే చిన్న చూపు :చేతిలో డబ్బు లేకపోయినా దాతలు, స్నేహితుల సాయంతో అభాగ్య వృద్ధుల్ని చూసుకుంటున్న శ్రీనివాస్ కుటుంబాన్ని చాలామంది తక్కువగా చూసేవారు. కొందరు బంధువులు మాట్లాడటం, కలవడం, కలుపుకోవడం మానేశారు. తమదికాని ప్రాంతంలో శ్రీనివాస్ దంపతులు చేస్తున్న నిస్వార్థ సేవ గురించి అందరికీ తెలియడానికి కూడా చాలా సమయం పట్టింది. తన గురించి తెలిశాక 2003 నుంచి షిర్డీ సంస్థాన్ ట్రస్టు రాత్రి పూట ఆశ్రమానికి భోజనం పంపడం మొదలుపెట్టింది. ఆ తరవాత ట్రస్టు ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సదుపాయం, ఆశ్రమంలో నీటి వసతినీ కల్పించింది. కొన్నాళ్లకి శ్రీనివాస్ సేవ గురించి ఆ నోటా ఈ నోటా తెలియడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పంజాబ్ ఇలా రకరకాల ప్రాంతాలకు చెందిన వారు ఆశ్రమానికి రాసాగారు.