Raghu Rama Krishna Raju Comments on Custodial Torture Case : సీఐడీ కస్టడీలో తనను కొట్టించిన పెద్దలెవరో త్వరలోనే బయటకు వస్తుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్‌పై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని రఘురామకృష్ణరాజు స్వాగతించారు. ఓడిపోతామని వారు ఊహించలేదని, ఈ కేసులో విచారణ మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. విచారణలో తనకు తెలిసిన నిజాలు అన్నీ చెప్పానని, అత్యుత్సాహం చూపిన అధికారులు తగిన ఫలితం చూస్తున్నారని పేర్కొన్నారు.
జగన్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా వచ్చి ఓ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు ప్రస్తావించాలని రఘురామ సూచించారు. చాలా రాష్ట్రాల్లో విపక్షానికి ప్రతిపక్ష హోదా లేదని, ప్రజలే తిరస్కరించినప్పుడు మనం మాత్రం ఏం చేస్తామని అన్నారు. జగన్ సభకు వచ్చి ప్రజల తరపున మాట్లాడితే బావుంటుందని అభిప్రాయపడ్డారు.
రఘురామకృష్ణరాజును ఎందుకు నిర్బంధించారు? - "తెలియదు, గుర్తులేదు"
ఎస్పీ విజయ్‌పాల్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు: ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైఎస్సార్సీపీ హయాంలో కస్టడీలో కొట్టిన కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని విజయ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏ కోర్టూ రఘురామను కస్టడీలో కొట్టినట్లు ధ్రువీకరించలేదని విజయ్ పాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. అయితే సికింద్రాబాద్‌లోని సైనిక ఆస్పత్రి వైద్య నివేదికలో అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు.
గుంటూరు మేజిస్ట్రేట్ రఘురామ కాలికి తగిలిన గాయాల్నిఅధికారికంగా నమోదు చేశారని రఘురామ తరఫు న్యాయవాది సుయోధన్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మేజిస్ట్రేట్ నమోదు చేసిన వివరాలపై మీ దగ్గర సమాధానం ఉందా అని విజయ్ పాల్ తరపు న్యాయవాది సింఘ్వీని సుప్రీం ధర్మాసన ప్రశ్నించింది. ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో వ్యాజ్యంపై విచారణ ముగించిన ధర్మాసనం, విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ కొట్టిసింది. సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్‌పై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని రఘురామ స్వాగతిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.
"ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కస్టడీలో రఘురామ కృష్ణరాజును కొట్టాం" - RRR Custodial Torture Case