ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్​ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదు: షర్మిల - SHARMILA LETTER TO YSR FANS

వైఎస్సార్‌ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాసిన షర్మిల

vja_sharmila_on_jagan
vja_sharmila_on_jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 1:39 PM IST

Updated : Oct 25, 2024, 3:23 PM IST

YS Sharmila Letter to YSR Fans: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు వైఎస్సార్‌ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖను రాశారు. వైఎస్సార్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నమే ఈ లేఖ అని షర్మిల పేర్కొన్నారు.

"ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలరు. అయినా YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. 'రాజశేఖర్ రెడ్డికి లోకం అంతా ఒకెత్తయితే", తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. "నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం'.

నలుగురు గ్రాండ్ చిల్డ్రన్​కి సమాన వాటా:వైఎస్ఆర్ బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్​కి సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ "గార్డియన్ మాత్రమే. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి మేండేట్. వైఎస్ఆర్ ఉద్దేశం ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ, స్పష్టంగా తెలిసిన విషయం. (కేవీపీ రామచందరరావు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలకి కూడా తెలుసు).

అన్నీ కుటుంబ ఆస్తులే:వైఎస్సార్ బతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా, భారతి సిమెంట్స్ అయినా, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. (ఒక్క సండూరు మినహాయించి). రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు.

స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న ఆస్తులు అన్నీ కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు నీకు. ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే.

ఎవరి సొమ్ము ఎవరు పంచుకుంటారు? ప్రకృతి సంపద వైఎస్ కుటుంబ ఆస్తా?

వందల కొద్దీ లేఖలు రాశారు: నేను జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాట అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబటే ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం. నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్లు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి అభిమతం గనుక, ఈ రోజు వరకు కూడా అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్లను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు.

ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు: రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని, నా శక్తికి మించిన సహాయం చేశాను. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కన పెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్థం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో ఏమో, నన్ను బాగానే చూశారు. పెద్ద కుమార్తె అన్నారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి ఊహించినట్లుగానే గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే. ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ కంపెనీల్లోనీ డివిడెండ్​లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు. వాళ్లు చేసింది ఉపకారం కాదు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్​లో సగం వాటా ఇవ్వడం జరిగింది. అది కూడా అప్పుగా చూపించమన్నారు.

జగన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు: 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన వెంటనే జగన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నచూపు చూడటమే కాకుండా సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. ఇందుకు అమ్మా, నేను వద్దు అని చెప్పాం. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టారు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక. భారతి సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగారు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పారు.

అర్దగంటలో ఆస్తుల విషయం తేలిపోయింది: అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే, 5 శాతం ఎక్కువ తీసుకో లేదా 10 శాతం ఎక్కువ తీసుకో, కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుంది అని అమ్మ చెప్పింది. అయినా ఇంతే అని బుల్లోజ్ చేశారు. తర్వాత అర్ధగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్​లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్​లో 100 శాతం. యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు. ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగింది.

MOUపై సంతకం ఎలా చేశారు? అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? - జగన్‌కు ప్రశ్నలు సంధించిన షర్మిల

ఈ రోజు వరకు ఇవ్వలేదు:ఆ కొద్దీ వారాల్లోనే MOU తయారయ్యింది. అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి, అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని, ఒప్పందం జరిగి సంతకాలు పెట్టాం. నా వాటా నాకు ఇస్తున్నారు తప్పితే ప్రేమ అభిమానాలతో కాదనేది వాస్తవమైనా, జగన్ మోహన్ రెడ్డిది పైచేయిగా ఉన్నది కాబట్టి, వాళ్లు రాసినదానిపై అమ్మ నన్ను సంతకం పెట్టమని కోరింది. కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను, MOU మీద సంతకం పెట్టిన 2019 లోనే ఇవ్వాల్సి ఉండగా, ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్లకు లేదు. అమ్మ ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హెూల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్​ని 2021లో కొనుక్కోవడానికి అంగీకరించారు. ఇక తర్వాత రోజుల్లో వాళ్ల ఇండివిడ్యువల్ షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.

అదే 2021లో, నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగింది. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, నన్ను తొక్కడానికి జగన్ మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే, నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఉచ్చం, నీచం లేకుండా, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న దాన్ని అనే ఇంగితం కూడా లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నన్నే కాదు, వైఎస్ఆర్ సోదరుడు వివేకానంద రెడ్డి పర్సనల్ ఫోటోలు సాక్షి మీడియాలో అసభ్యకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారు.

సెటిల్ చేసుకుందామని చెప్పి కండీషన్ పెట్టారు:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయాక, ఆ ఓటమికి నేను కారణం అని వాళ్లు బలంగా నమ్మారు. కాబట్టి మాకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని, బంధువులను నా దగ్గరకు పంపించడం జరిగింది. మాకు విరోధం వద్దు అంటూనే, సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండీషన్ పెట్టారు. నేను జగన్ మోహన్ రెడ్డి మీద, భారతి రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశం. ఆ కండిషన్​ నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నాకు సమ్మతం అనిపించలేదు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్ మెంట్ జరగలేదు.

సెటిల్ మెంట్​కి ఒప్పుకోలేదని మళ్లీ కక్ష కట్టి, నా మీద, అమ్మ మీద NCLT లో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. పబ్లిక్​లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి, నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ED అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్​కి, ఆయన బెయిల్ రద్దుకి ఎటువంటి సంబంధం లేదు.

అన్నగా, మేనమామగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే - జగన్​కు షర్మిల కౌంటర్

మాలో మేమే ఈ నిజాన్ని దాచుకున్నాము:నిజానికి NCLT లో జగన్ మోహన్ రెడ్డి వేసిన కేసు అమ్మ మీద కాబట్టి, ఈ విషయం బయటకు వస్తే, YSR కుటుంబం అప్రతిష్ఠపాలయితే, యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే, అమ్మ ఎంతగానో క్షోభపడుతుందని, ఇది మాలో మేమే విషాన్ని గొంతులో దాచుకున్నట్టు దాచుకున్నాము. ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి ఇది. విలువలు, కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర రెడ్డి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం, ఆ తల్లికి ఎంత అవమానం? అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం, నా పక్కనే నిలబడి మాటల్లేని వేదన నిండిన మా అమ్మను మరింత బాధపెట్టకూడదని, అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి మేము ఎక్కడా బయట పెట్టలేదు.

చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం లేదు:బయట పడకుండా ఉండటానికి ప్రయత్నం చేశాం. కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక జగన్ మోహన్ రెడ్డి కారణం అని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ మోహన్ రెడ్డికి, మమ్మల్ని మోసం చేసిన వాళ్లుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా? నేను జగన్​కి ఒక లెటర్ రాస్తే.. అది టీడీపీ హ్యాండిల్​లో పోస్ట్ అయితే నాకు ఏం సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను గాని, నా మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం YSR బిడ్డకు లేదు. జగన్ మోహన్ రెడ్డి ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.

ప్రతి YSR బంధువుకి ఈ వివరణ ఇస్తున్నాను: అమ్మ, నేను మోసం చేస్తున్నామని, ఆస్తి కోసం అత్యాశ పడుతున్నామని, YSR అభిమానులు భావించకూడదని పైనున్న వాస్తవాలు అన్నీ మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుచేస్తున్నా MOU నా చేతుల్లో 5 ఏళ్లు ఉన్నా, దాంట్లో నాకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా, ఏ ఒక్క మీడియాకి గానీ, కోర్టుకి గానీ, ఈ MOU నాకు నేనుగా బయటపెట్టలేదు. అవకాశం, అవసరం ఉన్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా, కుటుంబ గౌరవం, YSR పరువు కోసం నేను ఎక్కడా 5 ఏళ్లు MOU బయట పెట్టలేదు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన MOU ఈరోజు బయటకు వచ్చిందన్నా, పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా, NCLT లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బతుకు మీద అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు. కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో "YSR బంధం" ఏర్పరుచుకున్న ప్రతి YSR బంధువుకి ఈ వివరణ ఇస్తున్నాను. YSR అభిమానులంతా అమ్మను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని, వాస్తవాలను తెలియ పరుస్తున్నాను" అని లేఖలో వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

"ఆలోచన, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రేమ పునరుద్ధరిస్తా" - షరతులు వర్తిస్తాయన్న జగన్‌

Last Updated : Oct 25, 2024, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details