Shakeel Son Case Update: పంజాగుట్ట ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్యెల్యే షకీల్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రమాదం కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్టు పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే పంజాగుట్ట, బోధన్ ఇన్‌స్పెక్టర్లను అరెస్ట్ చేశామన్న ఆయన నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు.
ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్టు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు 2022 మార్చిలో జూబ్లీ హిల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడనీ ఆ కేసులో షకీల్ కుమారుడు రాహిల్‌ను తప్పించారనే వార్తలు వచ్చినట్టు వెల్లడించారు. అప్పటి కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని స్పష్టంచేశారు.
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం - పంజాగుట్ట పీఎస్‌లో సిబ్బంది మొత్తం బదిలీ
" ప్రజాభవన్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో కుమారుడిని తప్పించడానికి సహకరించిన షకీల్ కూడా దుబాయ్‌కి పారిపోయారు. వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాం. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశాం. 2022 మార్చిలో జూబ్లీ హిల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో షకీల్ కుమారుడు రాహిల్‌ను తప్పించారనే వార్తలపై కూడా తిరిగి విచారణ చేస్తాం." - డీసీపీ విజయ్
Ex CI Durga Rao Granted Bail : మరోవైపు ఇదే కేసులో అరెస్టు అయిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్ లభించింది. పరారీలో ఉన్న దుర్గారావును పోలీసులు గుంతకల్లులో అరెస్టు చేసి హైదరాబాద్‌లో విచారించారు. అప్పటికే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలనీ దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని ఆదేశించింది.
ఇదీ కేసు నేపథ్యం :2023డిసెంబర్ 23 రాత్రి మూడు గంటల సమయంలో అతివేగంగా దూసుకెళ్లిన కారు ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్, బారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ నడిపినట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణించారని ధ్రువీకరించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్కడి నుంచి సాహిల్ తప్పించుకుని అతని స్థానంలో తన కారు డ్రైవర్‌ను పంపించాడు. నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు అప్పుడు పంజాగుట్ట సీఐగా ఉన్న దుర్గారావు పూర్తిగా సహకరించారని నిందితులను మార్చేందుకు పలువురితో ఫోన్‌లో మంతనాలు జరిపినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి దుర్గారావు పరారీలో ఉన్నారు. అతని కోసం ఐదు బృందాలుగా పోలీసులు గాలించి గుంతకల్లులో అరెస్ట్ చేశారు. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు - పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీ ఝుళిపించిన సీఐ - వీడియో వైరల్