Furniture Godown Fire Accident in Hyderabad Today:తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుల్సుంపుర జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌లో ఫర్నిచర్ తయారీ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మూడంతస్తుల భవనంలోని, మూడవ అంతస్తులో 20 మంది గోదాంలో పనిచేసే సిబ్బంది చిక్కుకోగా వారిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన ద్వారా కిందకు తీసుకువచ్చారు. అయితే వారిలో ఆరుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కింది అంతస్తు నుంచి మంటలు పై భాగానికి వ్యాపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం పది అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే గోదాంలో ఎటువంటి అగ్నిమాపక ప్రమాణాలు లేనట్లు అధికారులు గుర్తించారు. మంటలను ఇంకా అదుపు చేస్తున్నారు. గాయపడిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. మంటలను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
గోదాం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. రాత్రి వేళ అంతమంది గోదాంలో ఎందుకు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. గోదాం యజమానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. రాత్రి సమయంలో 20మంది ఉద్యోగులు పని చేస్తున్నా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు లేవని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.