CM Chandrababu Warning to Minister Vasamsetti Subhash About Graduate MLC Voting : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు, ప్రజా ప్రతినిధులందరికీ చాలా సలహాలు, సూచనలు, హెచ్చరికలు చేస్తునే ఉన్నారు.
పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి గెలిచిన మిమ్మల్ని పార్టీ ఎంతో గౌరవించిందని సీఎం అన్నారు. ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి, గెలిచాక మంత్రిని కూడా చేశామని అన్నారు. అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా? అంటూ మండిపడ్డారు. మీరు సరిగా పనిచేయకపోతే నేను సీరియస్‌గా ఆలోచిస్తానని హెచ్చరించారు. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకయ్యా అని మండిపడ్డారు.
పట్టభద్రుల ఎన్నికల ఓట్ల నమోదుపై ఆయన ఆదివారం సాయంత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో 9వేలకు గాను 2,630 ఓట్లు నమోదు చేశారు. 29% మాత్రమే అయింది.
2029లోనూ గెలుపే లక్ష్యం - టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు
ఈ నెల 2న (శనివారం) కూడా 319 ఓట్లు మాత్రమే నమోదు చేశారు నువ్వు యువకుడివి. మొదటి సారి ఎమ్మెల్యేవి అయ్యావు రాజకీయాలపై సీరియస్‌నెస్ లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఓట్ల నమోదులో మీ నియోజకవర్గం ఎక్కడుందో చూసుకున్నారా? అని ప్రశ్నించారు.
మిమ్మల్నందరినీ ఒత్తిడి చేస్తున్నాననుకోవద్దు, నా బాధ్యత నేను చేస్తున్నానని తెలిపారు. మీ బాధ్యత మీరు చేయండి. ఏ ఎన్నిక వచ్చినా ఎమ్మెల్యేలు తమను తాము నిరూపించుకోవాలి ఆదేశించారు. రోజూ మీకు పరీక్షే, లేదంటే నేను ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని అన్నారు. అంచనాల మేరకు పని చేయడం లేదని ప్రజలకే చెబుతా అని హెచ్చరించారు. పని తీరు బాగాలేదంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌పైనా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓటరు నమోదులో వేగం పెంచాలని, మంత్రులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు వారికి సూచించారు.
ఆ 15 మంది MLAలకు చంద్రబాబు వార్నింగ్! - ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో జోక్యం