Nagula Chavithi 2024 : వేదవ్యాసుడు రచించిన స్కంద పురాణం ప్రకారం మనకు వేదాల్లో నాగ పూజ ప్రసక్తి లేనప్పటికీ, సంహితాల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. నాగు పామును నాగ రాజుగా, నాగ దేవతగా పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగు పాములను పూజించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
ఎందుకీ సంప్రదాయం?
జంతువులను పూజించడం సంప్రదాయంగా ఎందుకు మారిందంటే- భారత సనాతన సంప్రదాయంగా వస్తున్న విశ్వాసాన్ని అనుసరించి సమస్త జీవకోటిలో ఈశ్వరుడు ఉన్నాడని, ప్రకృతి ఆరాధనలో భాగంగానే సర్పాలను కూడా పూజించడం ఒక సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా కార్తీక శుద్ధ చవితి నాడు జరుపుకునే నాగుల చవితి పండుగ తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద పండుగ.
కుజ దోషాలను పోగొట్టే నాగుల చవితి
కార్తీక శుద్ధ చవితి రోజు చేసుకునే నాగుల చవతి పండుగ నాడు నాగదేవతలను పూజించడం వల్ల కుజదోషాలు తొలగిపోవడం సహా కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం.
నాగుల చవితి ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ చవితి నవంబర్ 5వ తేదీ మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజునే నాగుల చవితి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభసమయం. ఈసారి నాగుల చవితి మంగళవారం రావడం మరింత విశేషమైనది పండితులు చెబుతున్నారు. ఏ మాత్రం వీలు ఉన్నా నాగుల చవితి రోజు దేవాలయాలలో వెలసిన సుబ్రహ్మణ్య స్వరూపమైన నాగ ప్రతిష్టకు క్షీరాభిషేకం చేయడం ఉత్తమం.
పుట్టలో పాలు పోసే ఆచారం ఇందుకే వచ్చింది
నాగుల చవితి విశిష్టత అంతా పుట్టలో పాలు పోయడంలోనే ఉంది. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టలో లేదా ఊరి బయట ఉన్న పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడమనేది అనాదిగా వస్తున్న ఆచారం. పట్టణ, నగర ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో నాగుల చవితి సందడి ఎక్కువగా ఉంటుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు.
పురాణాలలో నాగుల చవితి ప్రసక్తి
మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి ఈ రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా సర్వరోగాలు పోయి సౌభాగ్యులవుతారని విశ్వసిస్తారు. కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
నాగుల చవితి ఉపవాసం ఎలా చేయాలి?
నాగుల చవితి ప్రధానంగా ఉపవాసాల పండుగ. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి ఉదయాన్నే పుట్టలో పాలు పోసి, చలిమిడి, చిమ్మిరి వంటి పదార్థాలు నాగ దేవతకు నైవేద్యంగా సమర్పించి అనంతరం ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజంతా పూర్తి ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు ఉడికించిన, వేడి చేసిన ఆహార పదార్థాలు తినరాదు. పచ్చి కూరగాయలు, వేడి చేయని పచ్చి పాలు, పళ్లు, పళ్లరసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి.
నాగుల చవితి రోజు కూరగాయలు కొస్తే?
సనాతన సంప్రదాయాలు పాటించే వారు నాగుల చవితి రోజు కూరగాయలు గాని పండ్లు గాని తరగ రాదు అని అంటారు.
మరుసటి రోజు కూడా ఇలానే!
నాగుల చవితి రోజంతా ఉపవాసం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి మళ్లీ పుట్టలో పాలు పోసి ఇంటికి వచ్చి ఉపవాసనాన్ని విరమించాలి. ఇక్కడ దొరికే పుట్టమన్ను కూడా ప్రసాదంగా కొంతమంది ఇంటికి తెచ్చుకుంటారు. ఈ పుట్ట మన్నును నుదుట విభూతి మాదిరిగా ధరిస్తే గ్రహ దోషాలు పోతాయని విశ్వాసం.
ఇది కూడా గుర్తుంచుకుందాం
పూజలు వ్రతాలూ నోములు మన సంప్రదాయంలో భాగమే! మనందరం వాటిని తప్పక పాటించాల్సిందే! అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే మనం శాస్త్రీయతను విశ్వసిస్తే పుట్టలో పాలు పోయకూడదు. ఎందుకంటే పాముకు పాలు అరగవు. పుట్టకు పాలు పోయాలనుకునేవారు పుట్ట దగ్గర ఓ మట్టి పాత్రను ఉంచి అందులో పాలు పోయాలి. పుట్టలో పాలు పోసినప్పుడు లోపల ఉన్న పాముకు ఊపిరి ఆడక దానికి హాని తలపెట్టినవారమవుతాం. అయితే ఇందుకు బదులుగా మనం దేవాలయాల్లో ఏర్పాటు చేసిన నాగ ప్రతిష్ఠకు మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాన్ని పుణ్య కార్యం కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది.
నిజమే కదండీ! మన నమ్మకాల కోసం మనం ఏ ప్రాణికీ హాని తలపెట్టకూడదు కదా!
ఇలా చేయడం వలన సంప్రదాయాన్ని పాటిస్తూనే ప్రకృతిని కాపాడుకున్న వారం అవుతాము. ఈ సమస్త సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. అందుకే మనం ఆచారాల పేరుతో ప్రకృతిని నాశనం చేయరాదు.
తిరుమలలో నాగుల చవితి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారు నాగుల చవితి సందర్భంగా శేష వాహనంపై తిరు మాడ విధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
మనమందరం కూడా రానున్న నాగుల చవితిని పర్యావరణానికి హాని చేయని విధంగా జరుపుకుందాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.
ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.