Aurobindo on 108 and 104 Services : ఆంధ్రప్రదేశ్‌లో 104, 108 సేవల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వీసుల పనితీరు ఘోరంగా ఉందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. నిర్వహణ దారుణంగా ఉందని నిఘా సంస్థలు కూడా సర్కార్‌కి నివేదించాయి. ఈ పరిస్థితుల్లో స్వయంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని లేదంటే అధికారాల అనుసారం కఠిన చర్యలు తీసుకుంటామని అరబిందో యాజమాన్యానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా దీనికి తగ్గట్లు టెండర్లు పిలిచేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది.
ప్రస్తుతం ఆ సర్వీసులు అందిస్తున్న అరబిందో సంస్థ సేవలపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సర్వీసుల వర్క్ ఆర్డర్లను వైఎస్సార్సీపీ సర్కార్ 2020 మార్చి 1న జారీచేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఏడేళ్ల కాలపరిమితితో 2020 జులై 1న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2027 వరకు గడువుంది. టెండర్లలో అరబిందో మాత్రమే ఎంపికయ్యేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి అల్లుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే నాటి ప్రభుత్వం అరబిందోకు పూర్తి సహాయ సహకారాలు అందించింది.
భారీగా వాహనాల కొనుగోలు : ఏపీలో 108 సర్వీసుల కింద అంతకుముందు ఉన్నవి, కొత్తగా కొనుగోలు చేసినవాటితో కలిపి ప్రస్తుతం 768 అంబులెన్సులు నడుస్తున్నాయి. 104 సంచార వైద్యం కింద కొన్ని వాహనాలను. వైఎస్సార్సీపీ హయాంలో కొనుగోలు చేశారు. 2019-24 మధ్యకాలంలో ఈ రెండు సర్వీసుల కింద రూ.450 కోట్లతో కొత్త వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఈ వాహనాల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన నివేదికలో పేర్కొంది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం స్పందించలేదు. కొన్నిచోట్ల గోల్డెన్ అవర్‌లో బాధితులకు 108 అంబులెన్సుల ద్వారా సేవలు అందలేదు. నిర్ణీత సమయానికి క్షతగాత్రుల వద్దకు అంబులెన్సులు వెళ్లలేదని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.
ఈ సంస్థలు నడిపే వాహనాలపరంగా నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు విధించాల్సిన జరిమానాలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఈ రెండు సర్వీసుల కింద పనిచేసే ఉద్యోగులకు సకాలంలో వేతనాల చెల్లింపులు జరగలేదు. యాజమాన్యం నుంచి 3 నెలలుగా వేతనాల చెల్లింపుల్లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 పథకం కింద గ్రామీణులకు అందించే మందుల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 108 సర్వీసు వాహనాలను నిర్వహిస్తున్న అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్యం డీజిల్ సరఫరాలో చేతులెత్తేసింది. దీని వల్ల శ్రీసత్యసాయి జిల్లాలో 108 వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
శిథిలావస్థలో అంబులెన్సులు- నిర్వహణను పట్టించుకోని గుత్తేదారు సంస్థ