New triple IT's in Telangana : బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ)కు అనుబంధంగా మరో రెండు కొత్త క్యాంపస్‌లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ట్రిపుల్ ఐటీలను నెలకొల్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గ ఉప సంఘంలోనూ వాటి ఏర్పాటుపై చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక్క ప్రాంగణాన్నైనా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి ఐటీ నిపుణులు తయారు కావాలన్న ఉద్దేశంతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మూడు ట్రిపుల్ ఐటీల్లో బాసర ఆర్‌జీయూకేటీ ఒకటి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ మిగిలింది. గ్రామీణ విద్యార్థుల నుంచి పోటీ అధికమైనందున ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ప్రాంగణాన్ని నెలకొల్పాలని విద్యావేత్త ఐఐటీ రామయ్య ఎన్నో ఏళ్లుగా కోరుతూ వచ్చినా అది నెరవేరలేదు. బాసర ఆర్‌జీయూకేటీలో ప్రతి ఏటా 1500 మంది ప్రవేశాలు పొందుతున్నారు.
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో బాసర ట్రిపుల్ ఐటీ 9 వేల మందికి పైగా విద్యార్థులతో కిక్కిరిసిపోతోంది. విద్యారంగంలో సంస్కరణలపై ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబు ఛైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఇందులో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నాలుగు ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలుస్తోంది. మరో రెండు ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌లను ప్రారంభించడం వాటిలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం లాంటి ప్రతిపాదనలు అందులో ఉన్నాయి.