Set Fire to Documents at Tadepalli SIT Office :ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం ఆవరణలో పెద్ద మొత్తంలో వివిధ పత్రాలను బూడిద చేయడం వివాదాస్పదమవుతోంది. హెరిటేజ్ (Heritage) సంస్థకు సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్లు తగులబెట్టారని తెలుగు దేశం ఆరోపణలు చేస్తోంది. సీఐడీ చీఫ్ రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగులబెట్టారని చెబుతోంది. చంద్రబాబును (Chandrababu Naidu) ఇబ్బంది పెట్టేందుకు గతంలో సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు.
వ్యక్తిగత పత్రాలు సీఐడీ దగ్గర :చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని అనేక మందిపై సీఐడీ (CID) ఒత్తిడి చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ సంస్థ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్‌ను దొడ్డి దారిన సంపాదించారని గతంలో లోకేశ్ ఆరోపణలు చేశారు. అవే డాక్యుమెంట్స్ చూపించి ఓ కేసులో లోకేశ్‌ను సీఐడీ ప్రశ్నించింది.
కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను లోకేశ్ నిలదీశారు. అన్ని సర్వేలు ఎన్టీఏ (NDA) కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో పత్రాలు తగుల బెట్టించారని టీడీపీ (TDP) వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమనే భయంతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.