తెలంగాణ

telangana

ETV Bharat / state

హై బీమ్ లైట్లతో కంటిసమస్యలు - జాగ్రత్తపడాలంటూ డాక్టర్ల హెచ్చరిక - ROAD ACCIDENTS FOR HIGH BEAM LIGHTS

హైబీమ్ లైట్లను వాడటంలో అవగాహన లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం - నేరుగా కంటిపై పడటంతోనే ముప్పు వాటిల్లుతుందన్న నిపుణులు - ఎల్​ఈడీ లైట్ల వాడకం పెరుగుతుందని ఆందోళన

MOTOR VEHICLE ACT 1988
HIGH BEAM LIGHTS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 6:53 PM IST

Vehicles High Beam Lights : రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు వాహనాలకు హెడ్‌ లైట్లు అత్యంత ముఖ్యమైనవి. వాటిని ఉపయోగించే తీరు కూడా అంతకంటే ప్రధానం. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వాహనాలకు హెడ్‌లైట్లు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలనే మార్గదర్శకాలను గతంలోనే జారీ చేసింది. ఆ లైట్లను సందర్భాన్ని బట్టి లోబీమ్, హైబీమ్‌గా మార్చుకోవచ్చు. చాలామంది దీనిపై అవగాహనరాహిత్యంతో హైబీమ్‌ లైట్లను ఆన్‌ చేసి ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

హైదరాబాద్‌ లాంటి నగరాల్లో రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు హైబీమ్‌ లైట్ల వాడకం అత్యంత ప్రమాదకరమైంది. ఆ లైట్లు ఎదురుగా వస్తున్న వాహనదారు కంటిపై నేరుగా పడటం వల్ల ముందున్న రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మోటారు వాహన చట్టం 1988 ప్రకారం ఈ లైట్ల వాడకం చట్టవిరుద్ధం కూడా.

ఎప్పుడు వాడకూడదంటే :భారీ వర్షాలు, పొగమంచు కురుస్తున్న పరిస్థితుల్లో ఎల్లప్పుడూ వాహనాలు లోబీమ్‌లోనే ప్రయాణించాలి. ఎదురుగా సుమారు 200 మీటర్ల దూరంలో వాహనాలు వస్తున్నప్పుడు హైబీమ్‌ లైట్లు వాడకూడదు. రాత్రి సమయాల్లో వెనుక నుంచి వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తున్నప్పుడు హైబీమ్‌ లైట్లతో డిప్‌ చేస్తూ ముందున్న వాహనదారుకు ఇండికేషన్ ఇవ్వాలి. ఎక్కువగా ట్రాఫిక్‌ ఉన్న సమయంలో దీనిని వాడకూడదు. యాంటీ గ్లేర్‌ గ్లాసెస్‌ వాడటంతో ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు నేరుగా కంటిపై పడినా అంత ప్రభావం, ఇబ్బంది ఉండదు. కారు పక్కనున్న అద్దాలను వెనుక నుంచి వచ్చే లైట్లు నేరుగా కంటిపై పడకుండా కాస్త వాటిని పక్కకు మార్చుకోవాలి.

"హైబీమ్‌ లైటు వాడటంతో ఎదురుగా వచ్చే వాహనదారుల కంటిలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా లైట్ల కిరణాలు నేరుగా కంటిపై పడటంతో కొంతసేపు వరకు ఏమీ కనిపించదు. దాంతో తాత్కాలిక అంధత్వం ఏర్పడుతుంది. కంటిలో ముఖ్యమైన రెటీనా పైనా ప్రభావం చూపుతుంది. కళ్లు పొడిబారడం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. కంటికి సర్జరీ జరిగిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి"-డాక్టర్‌ ఎం.గీతాంజలి, కంటి వైద్య నిపుణులు

ఫోకస్‌ ఎక్కువని ఎల్‌ఈడీ లైట్లకు మొగ్గు :నూతనవాహనం కొనుగోలు చేసిన కొన్ని రోజులకు కంపెనీ నుంచి వచ్చే లైట్లు పాడవుతుంటాయి. మళ్లీ అలాంటి వాటినే వాడకుండా వాహనదారులు ఎల్‌ఈడీ లైట్లను బిగించుకుంటున్నారు. ఇవి ఎక్కువ వెలుతురును ప్రసరింపచేస్తాయి. ఎల్‌ఈడీ లైట్లకు హైబీమ్ అవకాశమే ఉంటుంది. ప్రస్తుతం వీటి వినియోగం మరింత ఎక్కువవుతోంది.

‘టాప్‌ డ్రైవ్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రతలపై మేము పూర్తిగా అవగాహన కల్పిస్తుంటాం. ఇటీవల హైదరాబాద్‌లో ‘నో హైబీమ్‌’ పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌ నిర్వహించాం. హైబీమ్‌ లైట్ల వాడటంతో జరిగే అనర్థాలను వాహనదారులకు చెప్పాం. ఈ సమస్యపై ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు మరింత దృష్టి సారించాలి -సాయికౌశిక్, రోడ్డు భద్రత వాలంటీర్‌

"నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించొచ్చు"

హైదరాబాద్‌లోనే అత్యధికంగా కారు ప్రమాదాలు - వెల్లడించిన ప్రముఖ సంస్థ

ABOUT THE AUTHOR

...view details