Senior IAS Praveen Prakash Takes Back Voluntary Retirement : స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకుని, మళ్లీ సర్వీసులో చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని తొందరపాటున నిర్ణయం తీసుకున్నానని, అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని అందులో పేర్కొన్నారు.
ప్రభుత్వంలోని ముఖ్యుల్ని కలిసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్‌మెంట్ ఆడిగారు. ఆయన్ను కలిసేందుకు వారు విముఖత వ్యక్తం చేశారు. ఆయన విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించారు. ఇక ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ను తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు:వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర వివాదాస్పద అధికారిగా పేరు పొందడంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ను పక్కన పెట్టింది. బదిలీ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయమని కూటమి ప్రభుత్వం ఆదేశించింది.
కూటమి ప్రభుత్వంలో తనకు సరైన పోస్టింగ్ దక్కదని భావించిన ఆయన ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే జూన్ 25న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరబ్ కుమార్ ప్రసాద్ జులై మొదటి వారంలో జీవో జారీ చేశారు. ఆయన వీఆర్‌ఎస్ సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.