Ministers Canceled Various Tours Due To Stampede incident : తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తంచేశారు. విషాదకర ఘటన నేపథ్యంలో నేతలు తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు మధ్వాహ్నం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ్టి కర్నూలు జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుపతి వెళ్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను సాయంత్రం పరామర్శించనున్నారు.
ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి మంత్రి లోకేశ్ ఛైర్మన్ గా నేడు జరగాల్సిన మంత్రివర్గ ఉప సంఘం భేటీ వాయిదా పడింది. ఇవాళ అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొనడంలేదని లోకేశ్ ప్రకటించారు. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతో రద్దు చేస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రూ.25లక్షల పరిహారం : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం ప్రకటించింది. రుయా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను మంత్రుల బృందం, జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ప్రమాదమా? లేదా కుట్రా? : వైకుంఠ ఏకాదశి సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తిరుపతి ఘటన ప్రమాదమా? లేదా కుట్రా? అనే కోణంలో విచారణ జరుగుతుందని హోంమంత్రి అనిత తెలిపారు. ఎవరి వైఫల్యం ఉందో అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.
సీఎం చంద్రబాబు ఆగ్రహం : వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. అస్వస్థతకు గురైన బాధితులకు అందుతున్న వైద్యచికిత్సపై అధికారులతో సీఎం మాట్లాడారు. జిల్లా కలెక్టర్, తితిదే అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
'వారిద్దరే కారణం' - తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబుకి అందిన నివేదిక