Scam in the Name of Stock Market and Online Trading: స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట కేటుగాళ్లు ఓ భారీ స్కామ్ చేసి ఉడాయించారు. నాలుగు నెలల కిందట ఆ గ్రామంలో పెద్ద భవనం అద్దెకు తీసుకున్నారు. స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అంటూ వేలాది మందిని మోసం చేశారు. అందులో అమాయకులే కాకుండా ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు కూడా మోసపోయినవారిలో ఉన్నారు. రెండేళ్లలో సుమారు రూ.150 కోట్లుపైగా వసూలు చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయం ఎత్తివేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
లక్షల్లో సమర్పించుకున్న అమాయకులు: జిల్లాలోని కావలి పట్టణ సమీపంలోని మర్రిచెట్టు గిరిజన కాలనీలో రెండేళ్ల క్రితం ఓ భవనం అద్దెకు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించిన కేటుగాళ్లు లక్ష రూపాయలు కడితే రోజుకు రూ.6 వేలు ఇస్తామంటూ నమ్మబలికారు. అత్యాశకు పోయిన ప్రజలు వారి మోసాలు గ్రహించలేక లక్షల్లో సమర్పించుకున్నారు. ఉన్నట్టుండి కార్యాలయం మూసివేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
కమీషన్ ప్రాతిపదికన ఏజెంట్లను కూడా నియమించుకుని కావలి చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందికి ఎరవేశారు. అనేక మంది స్థిరాస్తులు కూడా విక్రయించి డబ్బులు డిపాజిట్ చేశారు. రెండేళ్లలో సుమారు రూ.150 కోట్ల మేర వసూలు చేశారని వాపోతున్నారు. బాధితుల్లో ఉపాధ్యాయులు, పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు పోలీసు అధికారులు గొలుసుకట్టు వ్యాపారం గురించి ముందే తెలుసుకుని నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు కార్యాలయం వద్దకు కావలి డీఎస్పీ శ్రీధర్ సిబ్బంధితో కలసి వచ్చారు. ఆ కార్యాలయం తలుపులను పగలగొట్టి లోపల దస్త్రాలను స్వాధీన పరుచుకున్నారు.