Central Government Eradicate To Faileria: దేశవ్యాప్తంగా 2030 నాటికి బోదకాలు వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అందుకు గాను ప్రభావం ఎక్కువగా ఉన్న 111 జిల్లాల్లో బాధితుల నమూనాలను పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ పరీక్షలు జరపడంతో పాటు వ్యాధి నివారణ మాత్రల పంపిణీని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు.
విజయనగరం జిల్లాపై ప్రత్యేక దృష్టి: మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇతర అధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇటీవల ఉమ్మడి విజయనగరం జిల్లా గుర్లా, బలిజపేట మండలాల్లో పరీక్షలు చేయగా 1% కంటే అధికంగా మైక్రో ఫైలేరియా కేసులున్నట్లు వెల్లడైెంది. దీంతో విజయనగరం జిల్లాపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది.
జీవితాంతం మోయాల్సిందే: బోదకాలు వ్యాధి బారిన పడితే జీవితాంతం మోయాల్సిందే. అప్రమత్తంగా లేకుంటే తరచూ ఇన్‌ఫెక్షన్‌లు వేధిస్తుంటాయి. అయితే, ఒకప్పటితో పోల్చితే వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో ఉపశమనం కలిగిస్తోంది. 2010-24 మధ్యకాలంలో రాష్ట్రంలో 196 కేసులు కొత్తగా బయటపడగా, విజయనగరం జిల్లాలోనే 77 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40,877 బోదకాలు బాధితులుండగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది.