తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి బ్యాడ్​న్యూస్ - లబ్ధిదారుల ఎంపిక మరింత ఆలస్యం! - INDIRAMMA HOUSING SCHEME NEWS

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మరింత ఆలస్యం - ఈ నెల 26న లాంఛనంగానే పథకం ప్రారంభం - గ్రామసభల్లో భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక మరింత సమయం పట్టే అవకాశం

Indiramma Housing Scheme
Indiramma Housing Scheme (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 7:45 AM IST

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పేద ప్రజలకు మరోసారి నిరాశ తప్పేలా లేదు!. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ప్రకటించడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న గ్రామసభల్లో అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తున్నారు. అసలైన లబ్ధిదారుల జాబితాను ఇంకా ప్రకటించడం లేదు. ఈ నెల 26న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఆ తర్వాత కొంత సమయం తీసుకొని పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని భావిస్తోంది. ఇందులో నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రకటించనుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. వీటి గురించే ఇప్పటి వరకు సుమారు 8 లక్షల అర్జీలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజా పాలనలో భాగంగా కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసం మాత్రమే మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాల్లో 100 శాతం యాప్‌ సర్వే పూర్తి అయింది.

కానీ దరఖాస్తులు ఇచ్చినా, సర్వేయర్లు ఎవరూ రావడం లేదని పలుచోట్ల లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం ప్రారంభమైన గ్రామ, వార్డు సభల్లో రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అర్హుల జాబితాపైనే చెదురుమదురు ఘటనలు జరిగాయి. అర్హులు కానివారిని ఎందుకు జాబితాలో చేర్చారు అంటూ అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు.

సొంత స్థలం ఉన్న వాళ్లే 13 లక్షల మంది : రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను మంజూరు చేస్తామని గతంలోనే ప్రకటించింది. అలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉన్నట్లు యాప్‌ సర్వేలో తేలింది. అయితే నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో తమ ప్రాంతంలో ఎన్ని ఇళ్లను మంజూరు చేశారని ప్రజలు అడుగుతున్నారు. కానీ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. రెండు జాబితాలకు (సొంత స్థలం ఉన్నవారు, లేనివారు) సంబంధించిన వివరాలను మండల స్థాయిలో ఎంపీడీవోలు, పురపాలికల్లో కమిషనర్ల లాగిన్‌లకు మాత్రమే పంపిస్తున్నారు.

జిల్లా అధికారులకు, హౌసింగ్‌ శాఖ పీడీలకు ఈ సమాచారాన్ని అందించనే లేదు. దీంతో అధికార యంత్రాంగంలో కూడా లబ్ధిదారుల ఎంపికపై ఒక స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీన ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించినా, లబ్ధిదారుల పూర్తి స్థాయి జాబితా రావడానికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని హౌసింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారుల జాబితాకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి అని, ఇలాంటి ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి మరికొంత సమయం అవసరమని సంబంధింత వర్గాలు చెబుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ - దరఖాస్తులకు మరో చాన్స్‌

రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోవాలా? - ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి

ABOUT THE AUTHOR

...view details