Godavari Rising at Bhadrachalam :ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు, కల్యాణ కట్ట వద్ద చాలా మెట్లు వరదనీటిలో మునిగాయి. శబరి నది పోటెత్తడంతో భద్రాచలం దిగువన ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరు చేరి పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన శ్రీరాం సాగర్ బ్యారేజి నుంచి వరదనీరు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మరింత పెరుగుతుందని, లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల వరద వస్తోందని అన్నారు. ఇంద్రావతి, సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి ప్రవాహం వస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకు 10,32,816 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది. పట్టణంలో బ్యాక్ వాటర్‌ను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా స్లూయిజ్‌ల వద్ద గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.