Seat Belt Safety Tips:"యాక్సిడెంట్ అంటే.. బైకో, కారో రోడ్డుమీద పడిపోవడం కాదు.. ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడిపోవడం" ఓ తెలుగు సినిమా డైలాగ్ ఇది. కానీ.. ఇందులో జీవితం ఉంది. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోతే.. మొత్తం కుటుంబమే అనాథ అవుతుంది. అందుకే.. రోడ్డెక్కామంటే గమ్యం చేరేవరకూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ.. చాలా మంది అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. చిన్న సీటు బెల్టు ప్రాణాన్ని కాపాడుతుందని.. కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఆపుతుందని తెలిసినా.. లైట్ తీసుకుంటారు.
అసౌకర్యం అనుకుంటే ప్రాణాలకే ముప్పు:కారులో ప్రయాణించే చాలా మంది సీటు బెల్టు పెట్టుకోవడాన్ని నామోషీగా భావిస్తుంటారు. అది ధరించకపోవడాన్ని హీరోయిజంగా ఫీలవుతుంటారు. కానీ.. కొన్ని వాహనాల్లో సీటుబెల్టు ధరిస్తేనే.. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. అంతేకాదు.. వాహనాలు గుద్దుకున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకున్నవారు సీటులోనే ఉంటారు. అది పెట్టుకోని వారు పైకి ఎగురుతారు. ఆ తర్వాత వారు ఎక్కడ పడతారు? దేనికి తగులుతారనేది తెలియదు. కాబట్టి.. తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలి.
ఎవ్వరికీ మినహాయింపు లేదు:గతంతో పోలిస్తే కార్లలో సీటు బెల్టు ధరించడం గురించి అవగాహన పెరిగింది. అయితే.. అది కేవలం ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్లకే పరిమితమవుతోంది. వెనుక సీట్లో కూర్చునే వారు ఈ నిబంధనలు తమకు వర్తించవని ఫీల్ అవుతున్నారు. 2019లో నిర్వహించిన ఓ సర్వేలో వెనుక వైపు ఉండే ప్రయాణికులను సర్వే చేయగా.. 7 శాతం మంది మాత్రమే సీటు బెల్టు ధరిస్తున్నట్లు వెల్లడైంది.
కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం
ఇటీవల లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో భాగంగా 10 వేల మందిని ఆరా తీయగా.. 70 శాతం మంది వెనుక వైపు ఉండే వాళ్లు సీటు బెల్టు ‘ధరించలేదు అని చెప్పడం గమనార్హం. వాస్తవానికి కేంద్ర మోటార్ వాహన నిబంధనల్లో 138 (3) నిబంధన కింద వెనుక సీట్లలో కూర్చునేవారూ సీట్ బెల్టు పెట్టుకోవాల్సిందే. లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. దురదృష్టవశాత్తూ దీని గురించి అవగాహన ఉన్న వారు అంతంత మాత్రమే. అందుకే ముందు సీటు ప్రయాణికులతో పాటు వెనుక సీట్లకు కూడా సీట్ బెల్టు బీప్ సౌండ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.