సీట్‌బెల్ట్, హెల్మెట్లే శ్రీరామరక్ష - అది పాటించకుంటే తప్పదు జీవిత శిక్ష! Seat Belt Negligence Accidents :దేశ జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్నిప్రాంతాలు జనాలతో నిండిపోతున్నాయి. ఆ జనాభా(Population) అవసరాలకు తగ్గట్లు వాహనాలూ పెరిగిపోతున్నాయి. వాటితో పాటే రహదారి ప్రమాదాలు కూడా ఇప్పుడు భారత్‌కు పెద్ద సమస్యగా మారాయి.
ప్రపంచం అంతటా రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతూ ఉంటే భారత్‌లో పెరిగిపోతున్నాయి. అతివేగం, సీటు బెల్టు ధరించకపోవడమే అత్యధిక ప్రమాదాలకు కారణం. వీటి బారినపడుతున్న వారిలో ఎక్కువ మంది యుక్త, మధ్య వయస్కులే. ఆ వయసులో ఉండే ఉత్సాహం వల్ల వాహనాలను అధిగవేగంతో నడుపుతున్న యువత త్వరగా ప్రమాదాల బారిన పడుతున్నారు.
Main Causes of Road Accidents :మునుపటితో పోలిస్తే ఇప్పుడు అత్యధిక వేగంతో నడిచే ద్విచక్రవాహనాలు, కార్లు అందుబాటులోకి రావడం కూడా ప్రమాదాలు పెరిగేందుకు మరో ప్రధాన కారణం. ప్రయోజకులై బంగారు జీవితాన్ని అనుభవించాల్సిన వీరు అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతూ కన్నవారికి శోకం మిగులుస్తున్నారు. ఉత్పాదక వయసులోని విలువైన మానవ వనరులైన యువతను కబళిస్తున్న రహదారి ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీరని నష్టం కల్గుతోంది.
MLA Lasya Nanditha Road Accident :రహదారి ప్రమాదాల బారిన పడి సామాన్యులే కాదు ప్రముఖులు, వారి పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. గత శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్‌చెరు వద్ద బాహ్య వలయరహదారిపై(Outer Ring Road) ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంగా వస్తున్న ఆమె వాహనం రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జై అక్కడికక్కడే మరణించారు.
నిద్రించే 'డ్రైవర్‌కు అలర్ట్'.. రోడ్డు ప్రమాదాలకు చెక్!
ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. సీటు బెల్టు ఉండంతో కారు నడిపిన ఆకాశ్ ప్రాణాలతో బయట పడ్డారని వెల్లడించారు. ఇలా రోడ్డు ప్రమాదాలు కేవలం వాహన చోదకుల నిర్లక్ష్యంతోనే ఎక్కువ జరుగుతున్నాయని అధికారుల దర్యాప్తులో తేలింది. అతివేగంతో పాటు నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు అధ్యికంగా జరుగుతున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. అంతకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు సహా సినీ ప్రముఖులు, క్రీడా రంగాలకు చెందిన వారి పిల్లలు కొందరు రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
Road Accidents Data Across India :తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచం అంతటా ఇవి తగ్గుతూ ఉంటే భారత్‌లో మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. జాతీయ నేరగణాంక సంస్థ లెక్కల ప్రకారం(NCRB) 2022లో దేశంలో 4.46లక్షల రోడ్డు ప్రమాదాలు జరగగా, 2021తో పోలిస్తే ఈ సంఖ్య 40% ఎక్కువ. రహదారి ప్రమాద మరణాలు 2021తో పోలిస్తే 2022లో 1.71లక్షలకు చేరాయి.
మరెంతో మంది గాయపడి దివ్యాంగులుగా మారారు. ఇది 2022 వరకు లెక్క మాత్రమే. తర్వాత గతేడాదిలో జరిగిన ప్రమాదాల లెక్క తేలాల్సి ఉంది. తెలంగాణలో సగటున రోజుకు 59 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 21మంది మరణిస్తున్నారు. రాష్ట్రంలో 2021లో మొదటి 3 నెలల్లో 5,738 ప్రమాదాలు జరగగా, 7,647 మంది మరణించారు. అయితే రహదారి ప్రమాదాల నివారణకు తెలంగాణ రాష్ట్ర రహదారి భద్రత మండలి చేపడుతున్న చర్యల వల్ల అవి కాస్త తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నా పరిస్థితుల్లో ఇంకా ఎంతోమార్పు రావాల్సి ఉంది.
Motorists Exercise Self Care :రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి కట్టడికి నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు. వాహనాన్ని నిర్ణీత వేగం కంటే 5% తగ్గించి నడపడం వల్ల 30% ప్రమాదాలు తగ్గుతాయని అంటున్నారు. చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ ధరించకపోవడమే అని తెలుస్తోంది. వేగాన్ని తగ్గించడంతో పాటు సీటు బెల్టు, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు హితవు పలుకుతున్నారు.
Car Seat Belt Must While in Driving : కారు సీటు బెల్టులను ఎన్నో పరిశోధనలు(Investigations) చేసి రూపొందించారు. వాటితో కారులోని సేఫ్టీ బెలూన్లు అనుసంధానమై ఉంటాయి. ఇటీవల వస్తున్న కొత్త మోడళ్లలో అన్ని వైపుల నుంచి బెలూన్లు తెరుచుకునేలా డిజైన్ చేశారు. మరోవైపు సీటు బెల్టు ధరించకపోతే హెచ్చరిస్తూ సిగ్నల్ వ్యవస్థ ఒకటి పని చేస్తుంది. సీటుబెల్టు ధరించిన సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్లు వేగం దాటిన తర్వాత వాహనం బలంగా ఢీకొడితే ప్రయాణికుడి వేగవంతమైన కదలికల ద్వారా ఒత్తిడి సీటు బెల్టుపై పడి వెంటనే బెలూన్లు ఓపెన్ అయ్యేలా వ్యవస్థ ఉంటుంది. ప్రయాణికుడు సీలింగ్, స్టీరింగ్ లేదా అద్దాలపై పడిపోకుండా సీటు బెల్టు రక్షణ కల్పిస్తుంది. దీని ద్వారా ప్రాణాపాయాన్ని 75 నుంచి 80 శాతం వరకు తగ్గించవచ్చు.
అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా - బతకడానికి డ్రైవింగ్ చేయన్నా
రహదారి ప్రమాదాలకు అధిక వేగం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం మాత్రమే కాదు వాహనదారుల పరధ్యానం, నిద్ర మత్తు, అలసట, ఎదుటి వాహనాల వెలుతురు, రోడ్డు మలుపుల్ని సరిగా అంచనా వేయకపోవడం, వాహనాలను సరిగా నియంత్రించలేకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ కూడా కారణాలే. ప్రమాదాలు ఎక్కువగా మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరుగుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక తెలిపింది. ప్రమాదాల సంఖ్య తగ్గించే విషయంలో ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక సూచన చేశారు.
Supreme Court Committee on Road Safety : వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు నిర్ధిష్ట పని వేళలు అమలు చేస్తే అలసట కారణంగా జరిగే ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. రహదారి ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన, ప్రమాద రహిత రహదారులు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, అత్యవసరం వైద్యం అనే 4అంశాల ప్రణాళికతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు నివారించవచ్చని జాతీయ రహదారుల(National Highways) భద్రతా మండలి గుర్తు చేసింది. వీటితో పాటు రహదారి భద్రతపై మదింపు చేపట్టి డిజైన్ లోపాలు, ప్రమాదాలకు కారణాలను గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాదాలకు సంబంధించి సమీకృత, సమగ్ర డేటాబేస్ సేకరించి నిల్వ చేయాలని రోడ్డు భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ కూడా సూచించింది.
Rules Followed to Prevent Road Accidents :రహదారి భద్రతలో సురక్షిత మౌలిక సదుపాయాలు, వేగ పరిమితులు, పాదచారులు, సైకిల్ చోదకుల అనుకూల విధానాల ద్వారా స్వీడన్ సున్నా ప్రమాదాల స్థాయిని సాధించింది. భారత్ కూడా రహదారి ప్రమాదాలను 2025నాటికి 50%కి, 2030 నాటికి మరణాలను సున్నా స్థాయికి చేర్చాలని లక్ష్యం నిర్దేశించించుకుంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల స్వీయ జాగ్రత్తలు, వేగ నియంత్రణే(Speed control) ప్రమాదాల నివారణలో కీలకం.
పిల్లలు వాహనాలు నడపకుండా తల్లితండ్రులు జాగ్రత్త వహించాలి. మద్యం మత్తులో వాహనం నడప కూడదు. ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుంది అన్న స్పృహ చాలా కీలకం. వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడకుండా ఉండడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వంటి చిన్న జాగ్రత్తలతో విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రమాదాలు తగ్గించి రక్తపుధారలు పారకుండా కట్టడి చేయవచ్చు.
ఇకపై ప్రతి కారులోనూ ADAS మస్ట్ - కేంద్రం కొత్త రూల్ - మరి ధరలు పెరుగుతాయా?
Top 8 Road Safety Rules in India : రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోవాల్సిందే.!