Students ill after ate Mid Day Meal in Narayanpet :రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడితే ఎవరైనా ఊచలు లెక్కబెట్టాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే హెచ్చరించినా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. కుమురం భీం జిల్లా వాంకిడి పాఠశాల వసతి గృహంలో గత నెల 30న భోజనం వికటించి 21 రోజులపాటు వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందిన విద్యార్థిని ఘటన మరవకముందే మరోసారి నారాయణపేట జిల్లాలో 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి 40మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు బాలికల్ని మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మక్తల్‌లో మరో 28మంది బాలబాలికలకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
పాఠశాలలో విద్యార్థులు రోజులాగానే ఇవాళ మధ్యాహ్నం భోజనం చేశారు. అన్నం, పప్పు, వంకాయ కూర తిన్న విద్యార్ధులకు సుమారు గంటన్నర తర్వాత కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆ తర్వాత విద్యార్ధులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. అలా సుమారు 40కి పైగా విద్యార్ధులు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండగా మాగనూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కన్నుంచి మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
సరిగ్గా వారం రోజుల కిందట ఇదే మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి..50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అందులో 15 మందిని మహూబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మరుసటి రోజు భోజనంలోనూ పురుగులు రావడంతో విద్యార్ధులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. వరుసగా రెండుసార్లు భోజనం వికటించడంతో జిల్లా విద్యాశాఖ అధికారిపై బదిలీ వేటు పడగా.. మండల విద్యాశాఖ అధికారి, ఇంచార్జ్ హెడ్ మాస్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఏజెన్సీని రద్దు చేశారు.
'అయ్యో బిడ్డా'.. 21 రోజులు వెంటిలేటర్‌పై పోరాడిన దక్కని ప్రాణం
తహశీల్దార్ పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం :అప్పటి నుంచి అధికారుల సమక్షంలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఇవాళ కూడా తహశీల్దార్ పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనాన్ని వండారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన కొందరు అక్కడే మధ్యాహ్న భోజనం తిన్నారు. అయినా మళ్లీ 40మంది అస్వస్థతకు గురికావడం.. విద్యార్ధులను వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. వారం కిందట ముక్కిన బియ్యం వండిన కారణంగా ఆహారం కలుషితమైందని భావించి, బియ్యాన్ని కూడా మార్చి కొత్త బియ్యం తెప్పించి వంటలు వండిస్తున్నారు. అయినా ఇవాళ విద్యార్థులు అస్వస్తతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం కిందటే ఆహారం వికటించినా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, మళ్లీ అదే సమస్య పునరావృతం కావడానికి వారి నిర్లక్షమే కారణమని ఆరోపిస్తున్నారు.
అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పురుగుల అల్పాహారం