Sangareddy Chemical Factory Blast Update :సంగారెడ్డి జిల్లాలోని రసాయన పరిశ్రమలో బుధవారం జరిగినపేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయిల్ బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, నలుగురు కార్మికులు మృతి చెందగా, తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయ సిబ్బంది గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్‌గా గుర్తించారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం ఆయిల్ బాయిలర్ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
Six killed in Sangareddy Chemical Factory Fire Accident :పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ, కార్మికుల్లో తమిళనాడుకు చెందిన దయానంద్, విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం, మధ్యప్రదేశ్‌కు చెందిన సురేశ్ పాల్ మృతి చెందారు. చందాపూర్ గ్రామానికి చెందిన విష్ణును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. తాజాగా శిథిలాల కింద మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. గాయాలైన 16 మందిని అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. క్షతగాత్రులను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు.
Harish Rao Reaction on Reactor Blast in Sangareddy : ప్రమాద ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్న బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫోన్ చేసి మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి అధికారులను కేటాయించి ప్రత్యేక అంబులెన్స్‌లలో ఉచితంగా తరలించాలని కలెక్టర్‌ను కోరారు. అంబులెన్స్‌లలో మృతదేహాలు చెడిపోకుండా కూలర్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరారు.