తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవన్నీ అప్పులు చేసి కొన్నాం - వాటి గురించి మీకెందుకు?' : ఎన్యూమరేటర్లకు ఎదురుప్రశ్నలు - SAMAGRA KUTUMBA SURVEY

రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వే తీరు - 243 ఉప కులాల కోడింగ్‌ నెంబర్లు ఉండటంతో అరగంట నుంచి గంట సమయం - ఇబ్బంది పడుతున్న ఎన్యూమరేటర్లు

Samagra Kutumba Survey
Telangana Samagra Kutumba Survey (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 12:55 PM IST

Telangana Samagra Kutumba Survey : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే రాష్ట్రంలోని జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ నెల 6 నుంచి 8 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ స్టిక్కరింగ్‌ పూర్తి చేశారు. 9 నుంచి సర్వే ప్రారంభించారు. ప్రతి ఇంట్లో నివసించే వారి సంఖ్యను నిర్ధారించడంతో పాటు ప్రతి కుటుంబం ప్రాథమిక సమాచారం సేకరించి ఫారంలో నమోదు చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 175 ఇళ్లు ఇచ్చారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు, 243 కోడింగ్‌ నెంబర్లతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. కుటుంబంలో మందిని బట్టి అరగంట నుంచి గంట సమయం పడుతోంది. సర్వే తీరుపై కొన్ని ప్రాంతాల్లో 'ఈటీటీ భారత్' పరిశీలన చేపట్టింది.

  • సర్వేలో ఇచ్చిన బుక్‌లెట్‌ ఆధారంగా ఫారం నింపాల్సి వస్తోంది. కేటగిరీల వారీగా బుక్‌లెట్‌ చూసుకుంటూ నింపడానికి ఇబ్బందులు పడుతున్నారు. సహాయకులు కావాలని అడుగుతున్నారు.
  • 19వ కాలంలో చేస్తున్న కుల వృత్తి చెప్పడానికి వెనకాడుతున్నారు. కుల వృత్తి చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
  • టీవీ, రిఫ్రిజిరేటర్, ద్విచక్రవాహనం, కారు, వాషింగ్‌మిషన్‌ వంటివి ఉన్నాయా అని అడుగుతున్నారు. వీటిని అప్పుపై తీసుకుని కొన్నాం, అవి ఎందుకంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. రుణాల విషయంలో వివరాలు తెలపడానికి నిరాకరిస్తున్నారు.
  • కొన్నిచోట్ల కులం తెలిపే క్రమంలో ఉప కులాలు చెప్పడంలో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం పన్ను కట్టేవారు సైతం చెప్పడానికి ఇష్టపడటం లేదు. కొంతమంది సొంత ఇల్లు ఉన్నా, అద్దె ఇంట్లో ఉంటున్నామని చెబుతున్నట్లు ఎన్యూమరేటర్లు వాపోతున్నారు.
  • పట్టణాలు, గ్రామాల్లోని కొన్ని చోట్ల ఇళ్లకు తాళం వేసి ఉంటున్నాయి. ఒక వేళ ఇంట్లో పెద్దలు ఉన్నా ఎన్యూమరేటర్లకు సరైన సమాధానం లభించడం లేదు. రుణాలు, ఆధార్‌కార్డులు, ధరణి పాసు పుస్తకాలపై సరైన సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
  • వృత్తికి సంబంధించి గృహిణిలు రోజూ వారి కూలీగా నమోదు చేసుకుంటున్నారు. ప్రజలు చెప్పిన సమాచారాన్ని తీసుకోవాలనే నిబంధన ఉండటంతో వారు చెప్పిందే ఎన్యూమరేటర్లు నమోదు చేసకుంటున్నారు.

ప్రశ్నలు అధికం, సమాధానాలు స్వల్పం: పలుచోట్ల సమగ్ర ఇంటింటా సర్వే తీరు పరిశీలించగా, మొత్తం 75 ప్రశ్నలకు ఇంటి కుటుంబ సభ్యులు సరైన సమాధానాలు చెప్పట్లేదు. కొన్నిచోట్ల వాయిదాల ప్రకారం తీసుకున్న రుణాల వివరాలను చెప్పడంలో ఇబ్బంది పడుతున్నారు. వాయిదాలు చెల్లించగా బ్యాంకు, ఇతర సంస్థల్లో ఎంత బాకీ ఉందన్న విషయం చెప్పట్లేదు. ఒక కుటుంబం వివరాల నమోదుకు సుమారు గంట సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు ప్రత్యేక కోడ్‌ను కేటాయించడంతో సిబ్బంది సమన్వయంతో పని చేయాల్సి వస్తుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండటంలో ప్రజలు అందుబాటులో ఉండటం లేదు.

ABOUT THE AUTHOR

...view details