తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచి మీ ఇంటికి ఆఫీసర్లు - ఆ వివరాలన్నీ అడుగుతారట! - స్టిక్కర్ వేయించుకోవడం మర్చిపోవద్దు

రాష్ట్రంలో రేపటి నుంచే సమగ్ర కుటుంబ సర్వే - మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ

kutumba Survey In Telangana
Samagra kutumba Survey In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 8:27 AM IST

Updated : Nov 5, 2024, 8:37 AM IST

Samagra kutumba Survey In Telangana :తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను రేపటి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 75 రకాల ప్రశ్నలతో గణకులు వివరాలు అడుగుతారు. ఈ క్రమంలో సర్వే చేసే గణకులు ఇంటికి వచ్చి ఏం ప్రశ్నలు అడుగుతారు.? ఏం సమాధానం చెప్పాలనే చాలా మంది ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కింద ఇచ్చే సమాచారం ఒకసారి చదవితే కుటుంబ సర్వేలే ఏం అడుగుతారో తెలుస్తుంది.

మీకున్న ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. అలాగే అప్పులు ఉంటే అవి కూడా చెప్పాలి. సంవత్సరానికి వచ్చే ఆదాయమెంత, ఇంట్లో ఎంతమంది ఉంటారనే విషయాలు అడుగుతారు. ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా? అనే వివరాలు తీసుకుంటారు. ఈ మేరకు సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్‌ నంబర్, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటారు.

విదేశాలకు వెళ్తే ప్రత్యేక కోడ్‌ : కుటుంబంలో ఎవరైనా విదేశాలకు వెళ్లారా? లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది చెప్పాలి. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఎందుకు వెళ్లారనే వివరాలను కుంటుంబ యజమానిని అడుగుతారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్​ను నమోదు చేస్తారు. ఏ దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్‌ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ఎంత మంది వలస వెళ్లారు. ఏ కారణాలతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం కోసం ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలిపారు.

అప్పులు, ఆస్తులపై : ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతారు. గత ఐదేళ్లలో ఏమైనా అప్పులు తీసుకున్నారా? అని అడుగుతారు. తీసుకుంటే ఎందుకు తీసుకున్నారని, ఎక్కడి నుంచి రుణం పొందారనే ప్రశ్నలను ప్రతి కుటుంబాన్ని అడగాలని నిర్ణయించారు. బ్యాంకులు, స్వయం సహాయక సంఘాల నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నారా? అనే వివరాలను కూడా చెప్పాల్సి వస్తుంది.

స్థిర, చరాస్తుల వివరాలు : కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తుల వివరాలన్నీ చెప్పాలి. చరాస్తుల వివరాలను వేర్వేరుగా నమోదు చేస్తారు. వీటిలో బైకు, స్కూటర్, సొంత అవసరాలకు వాడే కారు, కిరాయికి తిప్పుతున్న కారు వంటివి ఉన్నాయా? ఫ్రిజ్​లు, ఏసీలు, టీవీలు, వాషింగ్‌ మిషన్, స్మార్ట్‌ఫోన్‌ ఇలా మొత్తం 18 రకాల చరాస్తుల వివరాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? వాటి విలువ ఎంత అనేది కూడా తెలపాల్సి ఉంటుంది.

మీకు ఇల్లు ఉందా : మీకు ఇల్లు ఉంటే ఎన్ని గజాల్లో ఉంది. ఏ ప్రాంతంలో ఉంది? ఇంటిలో ఉన్న మొత్తం గదులెన్ని, బాత్‌రూమ్, మరుగుదొడ్డి ఉన్నాయా ఇలాంటి వివరాలన్నీ వివరించాలి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. అది పట్టా భూమా? లేదా ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్‌ లేదా పట్టాలేని అటవీ భూమా వంటి వివరాలు చెప్పాలి. గత ఐదేళ్లలో ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారా? ఆ పథకాల పేర్లు ఏమిటి? వంటి వివరాలు సేకరిస్తారు.

ఎవరైనా ఎన్నికయ్యారా?: కుటుంబంలో నుంచి ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా? ఎన్నికైతే రిజర్వేషన్‌లోనా, ఎన్ని పర్యాయాలు అనేది చెప్పాలి. రాష్ట్రపతి, ప్రధాని తప్ప మిగతా ఏ హోదాలో ప్రజాప్రతినిధిగా పని చేసినా వివరాలు చెప్పాలి. వార్డు సభ్యుడి నుంచి కేంద్రమంత్రి, గవర్నర్, సీఎం దాకా ఏ పదవి పొందినా సరే నమోదు చేసుకోవాలి.

ఇంటి గోడపై స్టిక్కర్‌: సర్వే సమయంలో గణకులు కుటుంబాల నుంచి స్పష్టమైన సమాచారాన్ని తీసుకోవాలి. ప్రతి ఇంట్లో నివసించే కుటుంబసభ్యుల సంఖ్య తీసుకోవాలి. సర్వే ఫారంలో యజమాని పేరు, ఇంటి నంబరు వివరాలు రాయాలి. సర్వే పూర్తయిన ఇంటిగోడపై స్టిక్కర్‌ అతికించాలి. సర్వే చేసిన తర్వాత ఫారాల్లో నమోదు చేసిన వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలి. ఈ ప్రక్రియ చాలా కీలకం. డేటా ఎంట్రీ సమర్థంగా నిర్వహిస్తేనే విశ్లేషణ కచ్చితత్వం సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రణాళిక శాఖ జిల్లా, మండలాల్లో అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి, వారికి శిక్షణ పూర్తి చేసింది.

సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక : రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) చేయడానికి శాసనసభ తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అన్నివర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ సర్వేకు ప్రణాళిక శాఖ నోడల్‌ విభాగంగా వ్యవహరిస్తోంది.

సర్వేలో 80 వేల మంది ఉద్యోగులు :దాదాపు 80 వేల మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొంటారు. వీరిలో విద్యా శాఖ నుంచి 48,229 మంది ఉంటారు. అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులను సైతం వీలును బట్టి సర్వేకు వినియోగిస్తారు. ఒక గ్రామంలో కనీసం 175 కుటుంబాలుంటే మొత్తంగా దాన్ని ఒకే ఈబీగా నిర్ణయించి ఒక గణకుడికి అప్పగిస్తారు. అంతకన్నా ఎక్కువ కుటుంబాలుంటే వాటిని చిన్న యూనిట్లుగా కనీసం ఒక్కో ఈబీలో 150 ఇళ్లు ఉండేలా విభజించి గణకులను నియమించి సర్వేను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సమాచార గోప్యత : సర్వే సమయంలో కుటుంబం నుంచి తీసుకున్న సమాచారం విషయంలో గోప్యత పాటించాలని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ఈ విషయాన్ని గణకులు ముందుగానే యజమానికి వివరిస్తారు. ఎక్కడా ఈ సమాచారం బయటపెట్టరని హామీ ఇస్తారు. ఫారంలోని వివరాలన్నీ నింపిన తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. గణకులు వివరాలను డేటాఎంట్రీ కేంద్రంలోని ఆపరేటర్‌కు ఇచ్చి వాటిని పూర్తి చేయిస్తారు.

విద్యార్థులకు గుడ్​న్యూస్​ - ఈ నెల 6 నుంచి ఒంటిపూట బడులు - ఇప్పుడు ఎందుకంటే?

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పత్రాలన్నీ దగ్గర ఉంచుకోండి

Last Updated : Nov 5, 2024, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details