Warangal Sainik School History : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్లోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమి దేశ రక్షణకు మెరికల్లాంటి సైనికులను తయారు చేస్తుంది. ఈ స్కూల్‌లో చదివిన పలువురు విద్యార్థులు సరిహద్దుల్లో సైనికులుగా పని చేస్తూ దేశ రక్షణలో పాలు పంచుకుంటున్నారు. ఈ విద్యాలయంలో చేరిన నిరుపేద గిరిజన విద్యార్థులకు విద్య, వసతితో పాటు వ్యాయామం, దేహదారుఢ్యం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
పలు అంశాలను నేర్చుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే శారీరక, రాత పరీక్షలను సులువుగా అధిగమించి భారత సైన్యం, అగ్నివీర్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎప్, నేవీ, పోలీసు విభాగాల్లో ఎంపికై సేవలందిస్తున్నారు. 1984లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ది చెంది సైనిక్ స్కూల్‌గా ఎదిగింది. 2022,2023 విద్యా సంవసత్సరాల్లో త్రివిధ రక్షణ దళాలు, భద్రత, తదితర విభాగాల్లో 22 మంది సేవలందిస్తున్నారు. అగ్నివీర్‌కు (ఆర్మీలో) నలుగురు, జీడీఎస్ పోస్టల్‌కు ముగ్గురు, ఫైర్‌మెన్‌కు ఏవోసీకి ఒకరు, సీఆర్పీఎఫ్కు ఒకరు, బీఎస్ఎఫ్కు ఒకరు, భారత సైన్యానికి ఐదుగురు, నావికా దళానికి ఇద్దరు, టీఎస్ పోలీస్ కానిస్టేబుళ్లుగా ఐదుగురు ఎంపికయ్యారు.
"సైనిక్ స్కూల్‌లో ఇంటర్‌లో చేరాను. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాను. ఇక్కడి అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పని చేస్తున్నా. దేశ రక్షకుడిగా పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు." - సైనిక్ స్కూల్ విద్యార్థి