Saanvi in World Book of Records : సాఫ్ట్‌వేర్ కుటుంబం.! ట్రెండీ జీవితం.! తీరిక లేని సమయం.! మరి, వారి పిల్లలు ఎలా పెరుగుతారనే ఆలోచనొస్తే ఇంకేముంది అమ్మానాన్నలకు దూరంగా పాశ్చాత్య సంస్కృతికి దగ్గరగా ఉంటారని అనుకుంటారు ఎవరైనా. కానీ ఈ అమ్మాయి అందుకు భిన్నం. రెండున్నర ఏళ్లకే పుస్తకాలు చదవడం అభిరుచిగా మలచుకుంది. క్రమంగా ఇతిహాసాలను దినచర్యలో భాగం చేసుకుంది. ఫలితంగా 5 నిమిషాల్లో భగవద్గీతలోని 58 శ్లోకాలు పఠించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్ట్స్ సహా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది. మరి, తనెవరో చూసేద్దామా.
విన్నారుగా భగవద్గీతలోని శ్లోకాన్ని ఎంత చక్కగా పఠిస్తుందో. బాల్యం నుంచే పుస్తక చదవడం అంటే మహా ఇష్టం. తొలుత బొమ్మలు, కథల పుస్తకాలు చదువుతూ క్రమంగా పురణాలు, ఇతిహాసాలపై దృష్టి సారించింది. కట్ చేస్తే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ TEDx స్పీకర్ సహా మరెన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకుందీ అమ్మాయి.
ఈ అమ్మాయి పేరు సాన్వీ జమాల్‌పూర్. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌కు చెందిన సునిత, ప్రదీప్ దంపతుల కుమార్తె. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేశారు. ఆ సమయంలో కుమార్తెను డేకేర్ సెంటర్‌లో ఉంచి ఉద్యోగానికి వెళ్లేవారు. ఈ సమయంలో బొమ్మలతో కూడిన పుస్తకాలను చూడటం అలవాటు చేసుకుంది సాన్వీ.
నవలలు, ఇతీహాసాలు చదవడం : ఉద్యోగరీత్యా సాన్వీ తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అయితే కొవిడ్ సమయంలో ఎవ్వరూ బయటికి వెళ్లలేని పరిస్థితి. దీంతో కుమార్తె అభిరుచులను గుర్తించడం మొదలు పెట్టారు. చిత్రాలు వేయడం, కథలు పుస్తకాలు చదవడం చూసి ఆ దిశగా ప్రోత్సహించారు. అలా టీవీలో రామాయణం, మహాభారతం సీరియల్స్ వీక్షించి ప్రేరణ పొందిందీ అమ్మాయి. మెల్లగా నవలలు, ఇతిహాసాలు, పంచతంత్ర వంటి పుస్తకాలు చదవడం దినచర్యలో భాగం చేసుకుంది.
బాల్యం నుంచి భగవద్గీతలోని శ్లోకాలపై పట్టుసాధంచిందీ సాన్వీ. ప్రాచీన భగవద్గీతలోని క్లిష్టతరంగా ఉండే 700 శ్లోకాలను కంఠస్థం చేసి గీతా జ్ఞాన జ్యోతి బిరుదు పొందింది. దాంతో పాటు 5 నిమిషాల్లో భగవద్గీతలోని 58 శ్లోకాలు, 2 నిమిషాల 15 సెకన్లలో నారాయణ ఉపనిషత్తు పఠించి 11 ఏళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.