Rythu Nestham in Telangana 2024 :రాష్ట్రంలో రైతునేస్తం(Rythunestham) కార్యక్రమం రైతులకు పరిచయం కానుంది. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతోపాటు విస్తరణ సేవలు విస్తృతం చేసేందుకు రైతునేస్తం పేరిట రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇవాళ సచివాయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth)లాంఛనంగా ప్రారంభించనున్నారు. వ్యవసాయం రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం ద్వారా రైతులకు నూతన సాంకేతికత పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించి పంటల ఉత్పత్తి పెంచాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం.
Video Conference Services at Rythu Vedika :ఇందుకోసం ఇప్పటికే ప్రతి 5 వేల ఎకరాల విస్తీర్ణాన్ని ఒక క్లస్టర్ చొప్పున విభజించి ఒక అధికారిని నియమించింది. ఒక్కొక్క క్లస్టర్‌కు రైతువేదిక చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలు నిర్మించినప్పటికీ, అనుకున్న లక్ష్యం చేరలేకపోవడంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవడంతోపాటు కొత్త వ్యూహాలు రూపొందించడం, ప్రస్తుత వ్యవస్థను నవీకరణ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా ఆయా కార్యకలాపాలు మరింత బలోపేతం చేయడానికి అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్లను స్థాపించడానికి "రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ ఫామ్" అనే ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది.
మొదటగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున 110 రైతు వేదికల్లో(Rythu Vedika in Telangana) కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఉగాది పర్వదినం నాటికి మిగిలిన అన్ని రైతువేదికలు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్లతో పూర్తి స్థాయిలో నవీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.