Narsingi Land Issue Case : రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం నార్సింగిలో రూ.200 కోట్ల విలువైన రెండెకరాల భూమిపై హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఆ భూమి మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ధరణి పోర్టల్‌లో పట్టాదారు పేరును మార్చడం చట్టవిరుద్ధమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య కోర్టు అధికారాన్ని తక్కువ చేసి చూడటమే కాకుండా మోసం చేయడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. రెవెన్యూ అధికారుల సాయంతో నార్సింగిలోని సర్వే నెం 310/14/1లో పట్టాదారుగా ఉన్న ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును నమోదు చేసి పాస్‌బుక్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది.
ఆగ్రహించిన ధర్మాసనం : రెవెన్యూ అధికారుల అండదండలతో ధరణి పోర్టల్‌లో పేరు మార్చుకోవడంతో పాటు కోర్టుకు వాస్తవాలు వెల్లడించని ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి కరుణాకర్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను తొక్కి పెట్టడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్‌కు రూ.5 లక్షల జరిమానా విధించింది. 1908లో నార్సింగిలో కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమి పట్టాదారుగా తమ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో గండిపేట తహసీల్దార్ పట్టా పాస్‌బుక్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఏసియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున శత్రుగన్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎలాటి నోటీసు ఇవ్వలేదు : ఈ భూమికి సంబంధించి యధాతథాస్థితి కొనసాగించాలంటూ 2014లో ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తమకెలాంటి నోటీసు ఇవ్వకుండా పిటిషనర్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ పేరును పట్టాదారుగా చేర్చుతూ తహసీల్దార్ 2023 అక్టోబరు 13న ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. పట్టాదారు పాస్‌బుక్ కూడా జారీ అయ్యిందన్నారు. దీనిపై 2014లో ఇదే హైకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం యదాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.