Ruling Party Minister Scams in AP Government Schemes :ఏపీలో జగన్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ ఉత్తరాంధ్ర మంత్రి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఉంటామో ఊడతామేమోననే భయంతో కోట్ల రూపాయల విలువైన పనుల్ని అక్రమార్జనకు ఊతంగా చేసుకున్నారు. పిల్లలకన్నా మంత్రిగారికి బాగా కలిసొచ్చిన పథకం విద్యాకానుక. అందులోనే 5శాతం కమీషన్ విధానానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. మూడోవిడత విద్యాకానుకలో నాణ్యతలేని బ్యాగులు సరఫరా చేశారు. పంపిణీ చేసిన రెణ్నాళ్లకే చాలా వరకూ చినిగిపోయాయి. నిబంధనల ప్రకారం గుత్తేదారు(Contractor) అవన్నీ మార్చాల్సి ఉన్నా కేవలం ఆరు లక్షలే కొత్తవి ఇచ్చి సరిపెట్టేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం మౌనం :విజిలెన్స్ తనిఖీల్లోనూ ఇది బయటపడినా కీలక మంత్రి కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం మౌనం వహించింది. ఇక గతేడాది ఇచ్చిన విద్యా కానుకలోనూ(Vidya kanuka) 5శాతం కమీషన్ విధానమే కొనసాగించారనే విమర్శలున్నాయి. ఐతే కమీషన్లు ఇవ్వాలంటే కనీసం సగానికిపైగా బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు షరతు పెట్టారట. మంత్రిగారు ఇటీవలే రూ.500 కోట్ల మేర సమగ్ర శిక్షా అభియాన్ నిధులు విడుదల చేయించి గుత్తేదార్లకు 50 శాతానికి పైగా బిల్లులు చెల్లించేలా చూశారట. ఆ తర్వాత ఆయన వాటా ఆయన సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.
బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు
మంత్రికి సహకరించినందుకు సమగ్రశిక్షా అభియాన్‌లోని(Samagra Shiksha) ఇద్దరు కీలక అధికారులకూ వాటా ముట్టిందనే ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ చేయాల్సిన విద్యాకానుక కిట్ల కాంట్రాక్ట్‌నూ టెండర్లు లేకుండానే కట్టబెట్టడం దుమారంరేపింది. దస్త్రాన్ని 4 నెలలపాటు తొక్కిపెట్టి సరిగ్గా ఎన్నికల ముందు టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకే 772 కోట్ల విలువైన పని కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం న్యాయసమీక్షకు పంపాల్సిన వీటిని జోన్ల వారీగా విభజించి, టెండరు విలువ తగ్గిపోయేలా చేశారు.
Corruption Related To Textbooks :పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలతోపాటు(Text Books) ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం మార్కెట్‌లో విక్రయించే వాటినీ ఆ మంత్రి వదల్లేదు. సీఎంఓలోని ఓ సలహాదారుతో కలిసి స్కెచ్ వేశారు. ముద్రణా సంస్థల నుంచి భారీగా పిండుకున్నారు. ప్రైవేటు బడుల కోసం మార్కెట్‌లో విక్రయించే పాఠ్యపుస్తకాల ముద్రణకు గతేడాది ప్రభుత్వం ఒక పేజీకి 44 పైసలుగా నిర్ణయించి, 16 సంస్థలకు ఈ పనులను టెండర్లు లేకుండానే ఇచ్చేసింది. ఐతే మూడు సంస్థలే బినామీ పేర్లతో ముద్రణ బాధ్యతల్ని రెండేళ్ల కాలానికి దక్కించుకున్నాయి. ఈ ప్రక్రియలో సీఎంఓలోని ఓ సలహాదారు, మంత్రి భారీగా లబ్ధి పొందారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ట్యాబ్‌ల టెండర్లనూ పాత గుత్తేదారుకు కట్టబెట్టేందుకు మంత్రి గట్టిగా ప్రయత్నించారు. గతేడాది డిసెంబరులో పంపిణీ చేసిన ట్యాబ్‌లకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఉద్దేశించిన దస్త్రాన్ని రెండు నెలలు తొక్కిపెట్టారు. పాత గుత్తేదారుకే అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల ముందు 750 కోట్ల రూపాయల టెండర్‌ను పాతవారికి ఇవ్వొద్దని సీఎంఓలోని ఉన్నతాధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో కొత్తగా టెండర్లు పిలిచారు. ఐనా పాత గుత్తేదారుకే టెండర్ దక్కడం, సరఫరా చేసిన నెల రోజుల్లో బిల్లు ఇవ్వకపోతే బ్యాంకు నుంచి తీసుకునేలా గ్యారంటీ ఇప్పించడం మంత్రిగారి మహిమేనంటారు.
చిక్కీలు, కోడిగుడ్లు పేరిట మేత: ఇక మధ్యాహ్న భోజనం(Midday meal Scheme) పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారానికి మూడు రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ కావాల్సినంత మేశారు. ఇతర పథకాలకు చిక్కీ కిలో 135 రూపాయలకే ఇస్తుంటే, పాఠశాలల్లో సరఫరాకు కిలో 149 రూపాయల చొప్పున చెల్లించారు. మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల కాంట్రాక్టులోనూ దోచుకున్నారు. 2023 ఆగస్టుతో ముగిసిన కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ గడువును 2024 జులై వరకూ పొడిగించారు. నెక్ ధరతోపాటు రవాణా ఛార్జీలు కలిపి చెల్లించేలా జిల్లాల వారీగా గతేడాది టెండర్లు నిర్వహించారు. సరాసరిన కిలోమీటరుకు 40 నుంచి 50 పైసల వరకూ ఇస్తున్నారు. అదే పాత ధరతో మరో ఏడాది ఇచ్చారు. ఈ తతంగంలోనూ మంత్రివర్యులు లబ్ధి పొందారు.