TGSRTC Special Buses for Sankranti Festival : సంక్రాంతి పండగ దృష్ట్యా ఆర్టీసీ, ద.మ రైల్వే సంస్థ ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఎగువ, దిగువ మార్గాల్లో 1,030 అదనపు బస్సు సర్వీసులను నడపనున్నారు. గురువారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు 585, ఈనెల 15 నుంచి 20 వరకు ఖమ్మం రీజియన్ నుంచి హైదరాబాద్‌కు 445 బస్సులను ఏర్పాటు చేసినట్లుగా ఆర్‌ఎం(రీజనల్ మేనేజర్) సరిరాం వెల్లడించారు. 11, 12 తేదీల్లో అధికంగా 135 బస్సులు నడుస్తాయని తెలిపారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సు సర్వీసులు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన వివరించారు.
అడ్వాన్స్ రిజర్వేషన్ బస్సుల్లో టికెట్ల కోసం :అడ్వాన్స్ రిజర్వేషన్ బస్సుల్లో టికెట్ల కోసం www.tgsrtcbus.in బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లు, ఏటీబీ ఏజెంట్లను సంప్రందించవచ్చని ఆర్‌ఎం సరిరాం సూచించారు. హైదరాబాద్-ఖమ్మం మార్గాల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా నాన్ స్టాప్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్‌ఎం పేర్కొన్నారు. బుధవారం (ఈనెల 8) నుంచి 17 వరకు ఖమ్మం రైల్వేస్టేషన్ మీదుగా స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ.జాఫర్ తెలిపారు. స్పెషల్ రైళ్లకు ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే సంస్థ ప్రత్యేక రైళ్లను కేటాయించిందని వివరించారు. ఫిబ్రవరిలో ఖమ్మం ఆర్.ఎస్( రైల్వేస్టేషన్) మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. మొత్తం 6 రైలు సర్వీసులు ఒక్కో ట్రిప్పు చొప్పున నడవనున్నాయి.