RTC Bus Was Stopped Due To Overload :రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండటంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పెద్దఎత్తున ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోకి ఎక్కడంతో సిబ్బందికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో రద్దీ ఏర్పడి, ఇబ్బందిపడ్డ డ్రైవర్ ఆర్టీసీ బస్సును నిలిపివేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే :ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వెల్గటూర్ నుంచి కరీంనగర్ వైపుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెల్గటూరు మండల కేంద్రంలో బయలుదేరిన బస్సు అప్పటికే ప్రయాణికులతో నిండిపోయి ఉంది. పరిమితికి మించి బస్సులోకి ప్రయాణికులు ఎక్కడంతో పాటు ఫుట్‌బోర్డు దగ్గర వరకు విపరీతమైన రద్దీ ఉండటంతో అసహనానికి గురైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేశారు. ఫుట్‌బోర్డు దగ్గర ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్న వారికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ పరిస్థితిని అర్థం చేసకున్న ప్రయాణికులు దిగడంతో ఆయన బస్సును ముందుకు పోనిచ్చారు. 10 నిమిషాలు ఆగితే ఇంకొక బస్సు వస్తుందని, ఈ విధంగా కిక్కిరిసి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఏదైనా జరిగితే తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని వాపోయారు.