RTC Buses for CM YS Jagan Meeting: సీఎం జగన్ పర్యటన అంటే చాలు సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభకు జనాన్ని తరలించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను కూడా తరలించారు. తగినన్ని బస్సులు లేక సాధారణ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సిద్ధం సభకు జనసమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను తరలించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలోని 74 బస్సుల్లో 54 బస్సులను తరలించారు. ఒక్కసారిగా బస్సులు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. బస్సులపై ఆర్టీసీ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం సభకు బస్సులు- ప్రయాణికులకు తిప్పలు
సీఎం సభకు కుప్పం నుంచి బస్సులను తరలించారంటూ తెలుగుదేశం నాయకులు డిపో ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. బస్సులు లేకపోవడంపై డిపో అధికారులను నిలదీశారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే బస్సులు పంపుతున్నామని డిపో మేనేజర్ చెప్పారు. కుప్పం నుంచి 50, చిత్తూరు నుంచి 60, పలమనేరు నుంచి 40, పుంగనూరు నుంచి 70 బస్సులను తరలించారు. బస్సులన్నీ అనంతపురం తరలించడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి జిల్లాలో 374 ఆర్టీసీ బస్సులను ఈ సభ కోసం తరలించడంతో తమిళనాడు, కర్ణాటక సహా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా బస్టాండ్‌లోనే పడిగాపులు కాశారు. ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులు, కళాశాలల నుంచి ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్‌లో గంటల తరబడి ఎదురు చూసినా బస్సులు రాకపోవడం, వచ్చిన ఒకటీ రెండు బస్సులో సీట్ల కోసం జనాలు ఎగబడ్డారు. గమ్యస్ధానాలకు చేరడానికి అందుబాటులో ఉన్న బస్సులోనే నిలబడి ప్రయాణం చేశారు.