RRB New Exam Dates 2024 : రైల్వే అభ్యర్థుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రైల్వే పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీల్లో మార్పు చేసింది. ఇందుకు సంబంధించిన రివైజ్డ్ నోటీసును రైల్వే అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాలకు గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష తేదీలను ప్రకటించింది. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాలని రైల్వే బోర్డు తెలిపింది.
అన్ని రైల్వే జోన్లలో మొత్తం 41,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్, 452 ఆర్పీఎఫ్ ఎస్సై, 14,298 టెక్నీషియన్, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నియామక పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ప్రకటించారు. వీటిలో రైల్వే టెక్నీషియన్, ఆర్పీఎఫ్ ఎస్సై, జేఈ రాత పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసింది. కానీ అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష మాత్రం యధావిథిగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు అన్నీ నవంబరు, డిసెంబరు నెలల్లోనే జరగనున్నాయి.
మారిన ఆర్ఆర్బీ రాత పరీక్ష తేదీలు :
పోస్టులు | పరీక్ష తేదీల్లో మార్పు |
అసిస్టెంట్ లోకో పైలట్(సీబీటీ-1) | 25.11.2024 నుంచి 29.11.2024 (మార్పు లేదు) |
ఆర్పీఎఫ్ ఎస్సై | 02.12.2024 నుంచి 12.12.2024 |
టెక్నీషియన్ | 18.12.2024 నుంచి 29.12.2024 |
జూనియర్ ఇంజినీర్(JE) | 13.12.2024 నుంచి 17.12.2024 |