Revenue Minister Anagani Satya Prasad On Simhachalam Land issue : సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు రూ.5,300 కోట్ల విలువైన భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. మొత్తం 12,149 ఇళ్లను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా అంగీకారం తెలిపారని చెప్పారు. 2016-17 ధరలకే 70 వేల మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆ తేదీల నుంచే క్రమబద్ధీకరణ వర్తించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు.
అలాగే గాజువాకకు సంబంధించిన భూముల క్రమబద్ధీకరణకు కూడా సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత, భరోసా వచ్చిందన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు, ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు.
రిజిస్ట్రేషన్ విలువ రూ. 5,300 కోట్లు : అనంతరం గాజువాక ఎమ్మెల్యేల పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని స్పష్టం చేశారు. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 ఇళ్లను నిర్మించుకున్నారని, వాటిని క్రమబద్ధీకరణకు ప్రయత్నం గతంలోనూ చేశామని పల్లా తెలిపారు. ఇప్పుడు సీఎం నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాల భూములు సింహాచల దేవస్థానానికి బదలాయిస్తున్నట్లు వెల్లడించారు. దీని రిజిస్ట్రేషన్ విలువ రూ. 5,300 కోట్ల వరకు ఉందన్నారు. రెండు మూడు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు.