తెలంగాణ

telangana

ETV Bharat / state

గతంలో నిర్వహించిన గ్రూప్​-1 రద్దు - అదనంగా మరో 60 ఖాళీలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ : సీఎం రేవంత్​రెడ్డి - గ్రూప్ 1 నోటిఫికేషన్​పై రేవంత్​

Revanth Reddy on Group 1 Notification 2024 : త్వరలోనే గ్రూప్‌-1 ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి నూతనంగా గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. గతంలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా 15 రోజుల్లో పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 9:56 AM IST

Revanth Reddy on Group 1 Notification 2024 : ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

Telangana Group 1 Notification 2024 : సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం హైదరాబాద్​ నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కృషిచేసిన నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్‌నర్సుల పోస్టులను భర్తీచేశామని గుర్తుచేశారు. తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మరో పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలపై సర్కార్ కసరత్తు - ఈ నెలలోనే ఆ రిజల్ట్స్​!

సింగరేణి ఖాళీల్లో 80 శాతం ఆ ప్రాంతం వారికే : సింగరేణి నుంచి కొనుగోలు చేసిన బొగ్గుకు సొమ్ములు చెల్లించకుండా సంస్థ ఖాయిలా పడే పరిస్థితిని కేసీఆర్‌ సర్కార్ కల్పించిందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. కేంద్రం గనులను ప్రైవేట్​పరం చేస్తూ సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నా అప్పటి పాలకులు ప్రశ్నించలేదని విమర్శించారు. ఇతర సమస్యల పరిష్కారంలోనూ పదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని అన్నారు. అందుకే సింగరేణి కార్మిక కుటుంబాలు కాంగ్రెస్‌కు అండగా నిలిచాయని గుర్తు చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిపించాయని రేవంత్​రెడ్డి వివరించారు.

సింగరేణి ఎన్నికల్లోనూ కార్మికులు కారు పార్టీకి బుద్ధి చెప్పారని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. పోలైన 38,000 ఓట్లలో బీఆర్ఎస్​కు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి 1,298 ఓట్లు మాత్రమే దక్కాయని వివరించారు. తద్వారా గులాబీ పార్టీ అక్కడ స్థానం లేదని తేల్చి చెప్పారన్నారు . అందుకే అక్కడి సమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకున్నామని, సంస్థలో ఏర్పడే ఖాళీల్లో 80 శాతం సింగరేణి ప్రాంతం వారికే ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకున్నామని, సంస్థ పరిధిలోని ఉద్యోగాల భర్తీలో వయో పరిమితిని సడలించాలని సింగరేణి సీఎండీకి సూచించామని తెలిపారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలో సమస్యలన్నీ పరిష్కరించనున్నట్లు రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

కేసీఆర్​ సర్కార్​ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్​రెడ్డి పిలుపు

యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తాం : ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఖాళీలన్నీ భర్తీచేసి యువత ఆశలను, ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. గత సర్కార్ సింగరేణిలో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ అవసరాలకు మాత్రమే కార్మికులను వాడుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను 42,000ల నుంచి 5,000ల మందికి కుదించేదని, ప్రస్తుతం ఆ ప్రమాదం లేదన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న గనులన్నీ సింగరేణికే చెందేలా కేంద్రంతో మాట్లాడతామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

ఒకప్పుడు సింగరేణిలో 1,30,000ల మంది పనిచేసే వారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) అన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వంతులు తగ్గిందని చెప్పారు. వేలం బిడ్డింగ్‌లో సింగరేణి పాల్గొనకపోవడం వల్లనే కొత్త గనులు రావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేలంలో పాల్గొనేలా సింగరేణిని ఆదేశించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సంస్థ సీఎండీ బలరాం తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి

గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ - మరో 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details