ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల పేదలకు స్వేచ్ఛ కరవైంది: రిటైర్డ్​ ఐఏఎస్​ విజయకుమార్

Retired IAS Officer GSRKR Vijayakumar Interview: ఆయనో రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఐక్యతా విజయపథంతో పేరుతో పాదయాత్ర చేపట్టారు. 2700 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల పేదలకు స్వేచ్ఛ కరవైందని, ఎక్కడా చూసినా ఆధిపత్య ధోరణి కనిపిస్తున్నట్లు పాదయాత్రలో తన దృష్టికి వచ్చిందన్నారు జిఎస్ఆర్ కేఆర్ విజయకుమార్.

Retired IAS Officer Vijayakumar Interview
Retired IAS Officer Vijayakumar Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 10:47 AM IST

Updated : Feb 11, 2024, 12:03 PM IST

ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల పేదలకు స్వేచ్ఛ కరవైంది: రిటైర్డ్​ ఐఏఎస్​ విజయకుమార్

Retired IAS Officer GSRKRVijayakumar Interview :గడచిన ఐదేళ్లుగా ఎస్సీ, ఎస్టీలపై దమనకాండ, అణచివేత పరిస్థితులను గతంలో తానెప్పుడూ చూడలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ విజయకుమార్ వ్యాఖ్యానించారు. ఐక్యతా విజయపథం పాదయాత్రలో భాగంగా 2700 కిలోమీటర్ల పైచిలుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నానని ఆయన ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అట్టడుగు వర్గాల వారు దుర్భరమైన పరిస్థితుల్ని గడుపుతున్నారని ఆయన తెలిపారు. సంక్షేమం కోసం 2.5 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు చేసిన ఫలితాలు రాష్ట్రంలో ఎక్కడా కనిపించటం లేదని ఆయన ఇంటర్వూలో స్పష్టం చేశారు.

అణగారిన వర్గాలపై ప్రభుత్వ అణచివేత: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల పేదలకు స్వేచ్ఛ కరవైందని, తాము కోల్పోయిన వాటిని కూడా ధైర్యంగా అడగలేకపోతున్నారని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ వాపోయారు. ఎక్కడ చూసినా అణచివేత, ఆధిపత్యం కన్పిస్తోందన్నారు. ఒక మనిషిని చంపేసి, శవాన్ని డోర్‌ డెలివరీ చేసిన వ్యక్తి జైలు నుంచి బయటకొస్తే దండలు వేసి ఊరేగించడమేంటి? సమాజానికి ఇది ఎలాంటి సంకేతాలిస్తుంది అని ప్రశ్నించారు. ‘ఐక్యతా జయపథం’ పేరుతో గతేడాది జులై 23న తిరుపతి జిల్లా తడ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విజయ్‌కుమార్‌ కాకినాడ జిల్లా తుని వరకు 2,729 కిలోమీటర్ల మేర నడిచారు. 147 రోజుల్లో 1250 గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి లక్షల మందిని కలిశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ పేదల్లోని లక్ష మందితో ఈ నెల 14న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ‘అధిక జనుల మహాసంకల్పసభ’ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పాదయాత్ర పొడవునా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించామని అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేనందున వాటిని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఆ అధికారికి ఏకకాలంలో మూడు బాధ్యతలు - పోస్టు ఏదైనా ప్రతిపక్షమే టార్గెట్​

ఎస్సీ, ఎస్టీలపై దాడులు: ఈ ప్రభుత్వం తమ కోసం ప్రత్యేకంగా ఏం చేసిందన్న ప్రశ్న ప్రతిచోటా ఎస్సీల నుంచి వ్యక్తమైందన్నారు. గతంలో ఉన్న పథకాలన్నీ తొలగించారని వారంతా వాపోయారు. ఎస్సీల పిల్లలు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకున్నా గత ప్రభుత్వాలు ఉపకార వేతనాలు ఇచ్చేవి. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకే ఇస్తున్నారు. పేదలకు చదువులు దూరం చేస్తున్నారు. విద్యార్థికి చేరువగా బడులు ఉండాలన్నది ఐరాస సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటి. కానీ, ఏపీలో స్కూళ్లు మూసివేసి పిల్లలను దూరంగా ఉన్న పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధం. పేద పిల్లలను ఏళ్ల కిందటి స్థితిలోకి నెడుతున్నారు.

మా పాదయాత్రలో ప్రతి ఊరిలోనూ మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించాం. యువత వాటికి బానిసలవుతున్నారు. ప్రభుత్వం మత్తు పదార్థాల వాడకాన్ని అరికట్టలేకపోతోంది. ఈ సామాజిక సమస్యను రాజకీయ నాయకులుగా కాకుండా రాజనీతిజ్ఞులుగా చూడాలి. ఉపాధి దొరక్క మత్తుకు బానిసై యువత నిర్వీర్యమైపోతున్నారు. ఒక తరాన్ని కోల్పోతున్నాం. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కాపు కార్పొరేషన్‌ ద్వారా పేద యువతకు ఇన్నోవా కార్లు రాయితీపై అందించింది. వారు నెలకు రూ.15 వేలకుపైగా సంపాదిస్తున్నారు. ఈ ప్రభుత్వం అలాంటి పథకాలను ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలేవని అన్నారు మళ్లీ వారు బానిసలుగా, పాలేర్లుగా మారిపోతున్నారు. చదువుకున్న మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాల్లేవు. స్వయం ఉపాధికి ఆర్థికంగా చేయూతనిచ్చి, తమ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నారు. బాపట్ల పక్కన శీలంవారిపాలెంలో అగ్రవర్ణాల్లోని మహిళలు తిరుపతి జిల్లా కోట, వాకాడు మండలాలకు వలస వెళ్తున్నట్లు చెప్పారు.

'రాష్ట్రాలకు SC/ST వర్గీకరణ చేసే అధికారం ఉందా?' సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్​

మత్తు పదార్థాలతో ఓ తరం నిస్తేజం: నేను కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఎవరైనా సమస్యలతో వస్తే, పరిష్కరించడంపై దృష్టి పెట్టేవాళ్లం. ఇప్పుడు ఏ ఊరిలో చూసినా హృదయ విదారక పరిస్థితులున్నాయి. తోటపల్లి గూడూరు మండలం వరకలపూడిలో తమకు ఏడాదిలో 80-90 రోజులు మాత్రమే ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెప్పారు. ఎస్టీల జీవన ఉపాధిని ఆధిపత్య వర్గాలు లాగేసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా దొరవారిసత్రం దగ్గర అన్నెపూడిలో దశాబ్దాలుగా ఎస్టీలు చెరువులో చేపలు పట్టుకొని బతికేవారు. ఇప్పుడు అక్కడి పెత్తందారులు వారిని చేపలు పట్టుకోనివ్వడం లేదు. రేషన్‌కార్డులు పేదలకు ఇవ్వకపోగా కార్లలో తిరిగేవారికి ఇచ్చారు.

సంపద సృష్టించకుండా పేదరిక నిర్మూలనా: రహదారులు నాగరికతకు చిహ్నాలు అంటారు. కానీ రాష్ట్ర నాగరికత భయంకరమైన, లోతైన గుంతల్లోకి జారిపోతోంది. గుంతల రోడ్లతో వాహనాలు పాడవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. సమయం, ఇంధనం వృథా అవుతోంది. ఇదంతా జాతి సంపదను కోల్పోవడం కాదా? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల ద్వారా వారి ఆవాసాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికల వంటి మౌలిక వసతులు కల్పించాలి. కానీ ఆ ఊసే లేదు. ఆరోగ్యం దెబ్బతింటే చికిత్స చేయించుకోలేక పేదలు అప్పుల పాలవుతున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.60 వేలు, పట్టణాల్లో రూ.1.20 లక్షలు ఉంటేనే పేదరికం నుంచి బయటపడ్డట్లు. ఏ ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలో పేదరికం తగ్గిందని చెబుతున్నారు? ఆదాయ కల్పన లేకుండా, ఆస్తులు సృష్టించకుండా పేదరికాన్ని ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. మా పాదయాత్రలో 16 వేల అర్జీలు రాగా, ఇళ్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

జగన్ ఎస్సీ, ఎస్టీలను పూర్తిగా మోసం చేశారు: దళిత నేతలు

Last Updated : Feb 11, 2024, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details