Republic Day 2025 Guests From AP: ఆంధ్రప్రదేశ్లో పలువురికి అరుదైన గౌరవం దక్కింది. వారు ఎంచుకున్న రంగాల్లో విశేష సేవలు అందించినందుకు ప్రతిఫలం లభించింది. దేశ రాజధానిలో ఘనంగా జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం పొందారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెంటపాడులోని డీఆర్ గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కావ్యశ్రీకి అవకాశం దక్కింది. దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటం ముందు నృత్యం చేసే అవకాశం లభించింది. భవిష్యత్తులో మరిన్ని నృత్య ప్రదర్శనలిచ్చి రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావడమే తన లక్ష్యమని కావ్యశ్రీ చెప్పుకొచ్చింది.
రూ.10,000 బహుమతితో పాటు: ప్రత్తిపాడులోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న జవ్వాది రాహిని అని బాలిక సైతం దిల్లీ వెళ్లనుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పద్య రచన పోటీలు ఆన్‌లైన్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. మరాఠా యోధుడు నానా సాహెబ్ జీవిత చరిత్రపై పద్యం రాసి జాతీయ స్థాయికి ఎంపికవ్వడంతో, రూ.10,000 బహుమతితో పాటు దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలో పాల్గొనే అవకాశం లభించింది.
ఆచంట రైతుకు గుర్తింపు:ఆధునిక వ్యవసాయంలో రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచినందుకు ఆచంట రైతు నెక్కంటి సుబ్బారావు గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. వెల్లమిల్లి గ్రామానికి చెందిన యేలూరి సావిత్రి తొమ్మిదేళ్లుగా వీవోఏగా పని చేస్తున్నారు. గ్రామంలోని ప్రజలకు సేంద్రియ సాగుపై అవగాహన కల్పించడంతో ఈ ఆహ్వానం అందింది.
సర్పంచిగా సేవలకు ప్రతిఫలం: పెదతాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్నారు. ఈయన పంచాయతీ పాలకవర్గ మీటింగ్లు, జాతీయ పండగలు, పచ్చదనం, పరిశుభ్రత, ఈ-గ్రామ స్వరాజ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తదితర కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించారు.