Representative Anarchy in Joint Krishna Districts:కబ్జాల నుంచి కాల్‌మనీ వరకు వడ్డీ వ్యాపారం నుంచి క్యాసినోల వరకు గుట్కా నుంచి మట్కా వరకు అన్నింటా ముందుండే ఆ ప్రజాప్రతినిధి అభివృద్ధి విషయంలో మాత్రం అధమస్థాయిలో ఉంటారు. ఎవరో ఎక్కడో గాడిదకు నల్లబెలూన్లు కట్టినా కచ్చితంగా తననే అవమానించారని భుజాలు తడుముకునే మహాజ్ఞాని. మంత్రిగా వెలగబెట్టినప్పుడు తన శాఖ మీద పట్టులేని విజ్ఞాని. ఒక్కసారీ ఆ శాఖను సమీక్షించిన దాఖలాలు లేవనుకోండి. సన్నబియ్యం ఇస్తామని మాటమార్చిన వ్యక్తి ఆ విషయాన్ని అడిగితే ‘నీ అమ్మ మొగుడు’ అని బూతు పురాణం మొదలుపెడతారు. తన నియోజకవర్గానికి గతంలో ఉన్న కీర్తిని ఆ ప్రజాప్రతినిధి దిగజార్చారనేది ప్రజల అభిప్రాయం.
ఇనాం భూములకే గాలం:కృష్ణా జిల్లాలో ఓ ప్రముఖ పట్టణానికి శివారున ఉన్న దాదాపు 150 ఎకరాల ఇనాం భూములకే గాలం వేశారు. వస్తే 500 కోట్ల రూపాయల ఇనాం కొండ పోతే ఆయన భాషలో ఒక వెంట్రుక. ఆ భూముల్ని కొంతమందికి ఇనాం ఇచ్చినా తర్వాత రైత్వారీ పట్టాలు చేయలేదు. కాలక్రమంలో చేతులు మారి దేవదాయ భూములుగా ఉన్నాయి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారితో కలిసి ఆక్రమణకు స్కెచ్ వేశారు. అంతా సిద్ధమైంది.
రెవెన్యూ శాఖ కూడా నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఆ ఐఏఎస్ ఇవి దేవదాయశాఖకు చెందిన భూములు కావని ఎన్‌వోసీ జారీ చేశారు. ఈ దస్త్రం దేవదాయ శాఖ కమిషనర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ క్లియరెన్స్ దొరక్కపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్‌లో పడింది. అప్పటికే నాటి మంత్రికి కోట్లు ముట్టాయంటున్నారు. ఇప్పటికీ ఆ భూములు ఆక్రమణదారుల కబ్జాలోనే ఉన్నాయి. ఇటీవల కంచెలు కూడా వేశారు.
ఓ పట్టణ పరిధిలో వక్ఫ్ బోర్డు భూముల్లో కొంత భాగం భీమవరం వ్యాపారులు కొన్నారు. తన అధికారాన్ని ఉపయోగించి వారికి హక్కులు కల్పించి బదులుగా కోట్లు గుంజారు. ఆ పట్టణానికి సమీపంలోనే 8.64 ఎకరాల డీటీసీపీ అనుమతి ఉన్న లేఅవుట్‌ను 'బీప్' ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. ఒక ప్రముఖ వ్యక్తి మరో వ్యక్తికి ‘పవర్ ఆఫ్ అటార్నీ’ జారీ చేశారు. ఆ మేరకు కొంతమంది ఈ భూములను కొనుగోలు చేసుకుని సొసైటీ పేరుతో లేఅవుట్ వేసుకుని స్థలాలు పంపిణీ చేసుకున్నారు. అన్ని అనుమతులూ వచ్చాక విద్యుత్తు స్తంభాలు వేసే సమయంలో ఆ ప్రజాప్రతినిధి గ్యాంగ్ అడ్డుపడింది. తాను పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇవ్వలేదని మెలిక పెట్టి అసలు వ్యక్తి ఎదురు తిరిగారు. ఆయనకు ఈ నేత మద్దతుగా నిలిచారు. స్థలాన్ని తన అనుచరుల పేరుమీదకు మార్చుకుని స్వాధీనం చేసుకున్నారు. సొసైటీ సభ్యులు లబోదిబోమంటున్నారు.
దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే
ఆత్మహత్యలు చేసుకునేలా ఒత్తిళ్లు: పట్టణంలో ఒక స్థిరాస్తి వ్యాపారి షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణం చేశారు. ఆయన భారీగా సంపాదించారు. తనకు అప్పు ఉన్నారని దాన్ని చెల్లించాలని ఈ ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చారు. అప్పును కోట్లలో చూపించి అధికారులతో ఒత్తిడి పెంచారు. ఆ వ్యాపారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆపై షాపింగ్ కాంప్లెక్సు స్వాధీనం చేసుకున్నారు. మంత్రిగా చేసినప్పుడు ఓ అధికారికి రెవెన్యూ శాఖ నుంచి బియ్యం శాఖకు డిప్యుటేషన్‌పై ఒక జిల్లా అప్పగించారు. ఆ జిల్లా ధాన్యం సాగులో ప్రసిద్ధి ఇంకేముంది ధాన్యం కొనుగోలు పేరుతో రెండేళ్లు దుచుకున్నారు. బదులుగా ఓ విలాసవంతమైన విల్లా కానుకగా ఇచ్చారు.