Reliance Industries To Invest Rs 65000 Crore In AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. ఈ మేరకు రూ.65వేల కోట్లతో 500 కంప్రెస్సెడ్ బయోగ్యాస్-సీబీజీ ప్లాంట్లు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 3 ఏళ్లలో ఈ ప్లాంట్లను పూర్తి చేయాలని తీర్మానించగా వీటిద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న సంకల్పంతో చేపట్టిన రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ మెంటార్‌గా వ్యవహరించాలని సీఎం కోరగా సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
రూ.65వేల కోట్ల పెట్టుబడులపై అవగాహన ఒప్పందం :ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఐదు నెలల్లోనే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. ఇటీవల ముంబయిలో రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీతో సమావేశమైన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. అప్పుడే పెట్టుబడులపై అనంత్ అంబానీ, లోకేష్ మధ్య అవగాహన కుదరగా రూ.65వేల కోట్ల విలువైన పెట్టుబడులపై పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు :ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రిలయన్స్ ప్రతినిధులు వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా ఏపీలో 500 సీబీజీ ప్లాంట్స్ ఏర్పాటవుతాయన్న చంద్రబాబు సీబీజీకి ఉపయోగపడే పంటలు పండించటం ద్వారా రైతులకు ఎకరాకు దాదాపు 30వేలు ఆదాయం వస్తుందని వివరించారు. ఈ ప్లాంట్ల ద్వారా దాదాపు 110 లక్షల మెట్రిక్ టన్నుల పులియబెట్టిన సేంద్రీయ ఎరువు ఉత్పత్తి అవుతుందన్న సీఎం ఇది రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఇదేసమయంలో ఇటీవల తెచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీ లక్ష్యాలను చంద్రబాబు గుర్తుచేశారు.