YSRCP Govt Deal With SECI : మార్కెట్‌లో సౌరవిద్యుత్‌కు ఉన్న ధర కంటే యూనిట్ అర్ధరూపాయి ఎక్కువిచ్చి కొనేలా ఒప్పందం ఎందుకు చేసుకున్నారంటే గతంలో కొన్న ధర కంటే ఇది తక్కువే తెలుసా అనడం అడ్డగోలు వాదన కదా! సెకి నుంచి ఏకంగా 7000ల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అప్పటి వైఎస్సార్సీపీ సర్కార్ ఇలాంటి అడ్డగోలు, అతితెలివి సమాధానమే చెప్పింది. ఆ ఒప్పందంలో విద్యుత్ ఉత్పత్తిదారయిన అదానీ నుంచి వందల కోట్ల ముడుపుల్ని జగన్ పొందారన్న అమెరికా విచారణ సంస్థ కేసు నేపథ్యంలో అధిక ధరకు కొన్న అంశం ఇప్పుడు తెరపైకి వచ్చి, కీలక ప్రశ్నగా నిలిచింది.
- 2016లో 55 అంగుళాల సోనీ కంపెనీ 4కే ఎల్‌ఈడీ టీవీ ధర రూ.2 లక్షలకు పైనే ఉంది. 4కే టెక్నాలజీ అప్పుడే కొత్తగా అందుబాటులోకి రావడంతో ధర ఎక్కువ. అదే మోడల్ టీవీ 2018లో సుమారు రూ.1.20 లక్షలకు వచ్చింది. 2024కి వచ్చేసరికి గతంలో కంటే అనేక అధునాతన ఫీచర్లతో, పూర్తి ఎల్‌ఈడీ సదుపాయంతో రూ.55,000లకే దొరుకుతోంది. కొన్ని కంపెనీల టీవీలైతే రూ.35,000లకే అందుబాటులో ఉన్నాయి. టీవీల వినియోగం పెరగడం, విడిభాగాలు దేశీయంగానే తయారవడం, సాంకేతికత పెరగడంతో ధరలు గణనీయంగా తగ్గాయి. ఇంకా తగ్గుతున్నాయి కూడా!
- 2024లో ఎవరైనా 55 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ కొనాలనుకుంటే రూ.35,000ల నుంచి రూ.55,000ల వరకు ఉన్న టీవీల్లో ఒకదాన్ని ఎంచుకుంటారా? లేకపోతే మార్కెట్‌లో రూ.55,000 లున్న సోనీ టీవీని రూ.90,000లకు కొనేసి, 2016 నుంచి ఇప్పటి వరకు సోనీ టీవీల ధరల సగటు లెక్కేస్తే రూ.లక్ష వచ్చిందని, తాను రూ.90,000లకే కొన్నాను కాబట్టి, రూ.10,000లు ఆదా చేశానని చెబుతారా? ఎంత తెలివితక్కువ వాళ్లయినా ఆ పని చేయరు కదా!
- ఇంటెల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ ప్రతిపాదించిన ప్రఖ్యాత ‘మూర్స్ లా’ ప్రకారం ఒక మైక్రోచిప్‌లో అమర్చే విడిభాగాల సంఖ్య ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపవుతుంది. దానివల్ల సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు, ఖర్చు కూడా తగ్గుతుంది. సెమీకండక్టర్ టెక్నాలజీ విప్లవానికి చోదకశక్తిగా భావించే ఈ మూర్స్ సిద్ధాంతాన్ని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ‘గోల్డెన్ రూల్’గా పరిగణిస్తారు. ఈ సూత్రం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకే కాదు సౌర విద్యుదుత్పత్తిలో వినియోగించే సౌర ఫలకాల వంటి వాటికీ వర్తిస్తుంది.
- దేశంలో సౌర విద్యుత్ ఫలకాల తయారీ లేనప్పుడు వాటిని పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకునేవాళ్లం. దేశంలో వాటి తయారీ మొదలవడం, సాంకేతికత పెరగడంతో ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. పదిహేను సంవత్సరాల క్రితంతో పోలిస్తే సౌరఫలకాల ధరలు ఇప్పుడు సుమారు 84 శాతం తగ్గాయి. ఆ మేరకు సౌరవిద్యుత్ ధరలూ తగ్గాయి. ఒకప్పుడు యూనిట్ సౌరవిద్యుత్ ధర రూ.18-19 ఉండేది. నేషనల్ సోలార్ మిషన్‌లో భాగంగా 2010లో సౌరవిద్యుత్ ఒప్పందాలు చేసుకునేటప్పటికి యూనిట్ రూ.12.16 ఉంది. 2021కి రూ.1.99కి తగ్గింది. 2010తో పోలిస్తే సుమారు 83 శాతం తగ్గినట్టు. ఇంకా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
- వినియోగం పెరుగుతూ, టెక్నాలజీ అభివృద్ధి చెందేకొద్దీ విద్యుత్, చిప్‌లు, సెమీ కండక్టర్లు, వాటితో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల ధరలు ఎలా తగ్గుతూ వస్తాయో చెప్పేందుకు ఇవన్నీ ఉదాహరణలు. ఎంత సామాన్యుడికైనా ఈ లాజిక్ ఇట్టే బోధపడుతుంది. ఘనత వహించిన అప్పటి సీఎం జగన్‌కు, ఆయన వందిమాగధులకు తప్ప!
- పైన చెప్పుకొన్న టీవీ ఉదాహరణనే చూస్తే మార్కెట్‌లో రూ.35,000ల నుంచి రూ.50,000లు ఉన్న టీవీని రూ.90,000లకు కొని, కొన్నేళ్ల సగటు ధరతో పోలిస్తే రూ.10,000లు మిగిల్చానని ఎవరైనా చెబితే అతణ్ని పిచ్చోడిగా లెక్కేయాలి. లేకపోతే దుకాణదారుతో కుమ్మక్కై మిగతా డబ్బు నొక్కేసిన అవినీతిపరుడిగానైనా లెక్కగట్టాలి!
- మార్కెట్‌లో సౌరవిద్యుత్ యూనిట్ రూ.1.99కి దొరుకుతుంటే రూ.2.49కి కొనేందుకు సెకితో ఒప్పందం చేసుకోవడమే కాకుండా, కొన్నేళ్లలో గత ప్రభుత్వాలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సగటు ధర యూనిట్‌కి రూ.5.10 కాబట్టి, దానితో పోలిస్తే తాను ఆదా చేస్తున్నానని చెప్పిన అప్పటి సీఎం జగన్‌ను కూడా ఇలాగే పరిగణించాలి.
ఆఘమేఘాలపై ఒప్పందం :ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద రాజస్థాన్‌లో సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్న సెకి ఆ విద్యుత్‌ను యూనిట్ రూ.2.49 చొప్పున కొనాలంటూ 2021 సెప్టెంబర్ 15న జగన్ సర్కార్‌కి లేఖ రాసింది. ఆ మర్నాడే జగన్ మంత్రిమండలి సమావేశం పెట్టి నిర్ణయం తీసేసుకున్నారు. అదానీ రంగంలోకి దిగి అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పలు దఫాలు సమావేశమై ముడుపులపై ఒక అవగాహనకు వచ్చాకే ఒప్పందం జరిగిందని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
కిలో వంకాయలు కొనేటప్పుడే ఏ కొట్లో ఎంత ధర ఉందో చూసుకుని, ఒకటికి రెండుసార్లు బేరం చేసి కొంటామే, అలాంటిది 7000ల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు పాతికేళ్లపాటు ఒప్పందం చేసుకోవాలంటే సర్కార్ ఎంత ఆలోచించాలి? ఎన్ని కోణాల్లో పరిశీలించాలి? కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పదులకొద్దీ సలహాదారులు, వందిమాగధుల్లాంటి కొందరు ఐఏఎస్ అధికారులతో అలరారిన జగన్ ప్రభుత్వం మెరుపు వేగంతో గంటల వ్యవధిలో నిర్ణయం తీసేసుకుంది.
Adani Bribery Case Updates : అప్పటికి మార్కెట్‌లో సౌర విద్యుత్ యూనిట్ రూ.1.99కే దొరుకుతున్నప్పుడు ఒక్కో యూనిట్‌కి అర్ధరూపాయి ఎక్కువ పెట్టి ఎందుకు కొంటున్నారని అడిగితే అప్పటికి రాష్ట్రప్రభుత్వం కొంటున్న యూనిట్ సగటు ధర రూ.5.10 ఉంది కాబట్టి, తామే తక్కువ ధరకు కొన్నామని వితండ వాదానికి దిగింది. ఇంగితం ఉన్నవాళ్లెవరైనా అప్పటి మార్కెట్ ధరతో పోలుస్తారా? ఎప్పుడో యూనిట్ రూ.18-19 ఉన్నప్పటి నుంచీ సగటు లెక్కేసి దాని ప్రకారం తాము తక్కువ ధరకే కొంటున్నామని చెబుతారా? 2015లో అప్పటి సర్కార్ యూనిట్ రూ.5.96కి ఒప్పందం చేసుకుందని, దానితో పోలిస్తే తక్కువ ధరకు కొన్నామని సమర్థించుకోవడమేంటి? ఏటా సౌరవిద్యుత్ ధరలు తగ్గుతున్నప్పుడు 2015లోని ధరలతో ఎలా పోలుస్తారు? సెకితో ఒప్పందంలో భారీ అవినీతి, కుంభకోణం జరిగాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?