Navy Rehearsal in Visakhapatnam :భారత నౌకాదళానికి చెందిన నేవీ సన్నాహక విన్యాసాలను సాగరతీరాన తూర్పు నావికాదళం నిర్వహించింది. ఏటా డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం విశాఖలో జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2025లో జనవరి 4న విశాఖ సాగర తీరంలో నౌకాదళ దినోత్సవ కొనసాగింపు కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే నేవీ అధికారులు ప్రకటించారు.
ఇందులో భాగంగా ఈరోజు నేవీ డే విన్యాసాల కోసం రిహార్సల్స్ నిర్వహించారు. గగన తలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి.శత్రువులపై దాడి చేసే సన్నివేశాలు తీరంలో యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టాయి. మరోపక్క సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. తీరానికి దగ్గరగా ఆకాశంలో పారాగ్లైడర్లు దూసుకెళుతూ సందడి చేశారు. మరో 4 రోజులపాటు సన్నాహక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనవరి 2న ఫుల్ డ్రస్ రిహార్సల్ నిర్వహించనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఆరోజు జరిగే విన్యాసాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు వెల్లడించారు.
ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ షోల నిర్వహణపై దృష్టి సారించారు. ఈ విన్యాసాలను వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో రానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.