Red Chilli Price Low in Khammam Mirchi Yard :ఖమ్మం మార్కెట్ యార్డులో రోజువారీగా పతనమవుతున్న మిరప ధరలతో రైతన్నలు నష్టాలు మూటగట్టుకోవాల్సిన వస్తోంది. కొండంత ఆశతో రెక్కల కష్టాన్ని విక్రయించుకునేందుకు వస్తున్న కర్షకులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఖమ్మం మిర్చి మార్కెట్‌కు సోమవారం, మంగళవారం 20 నుంచి 30 వేల బస్తాల మిరపను రైతులు తీసుకొచ్చారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచే కాకుండా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి కూడా రైతులు మిరప బస్తాలు తీసుకొచ్చారు. మార్కెట్ యార్డులో గరిష్ఠ ధర క్వింటా ఎండు మిరపకు రూ.19 వేలు, తాలు మిరపకు రూ.9,800 పలికింది. కేవలం 20 శాతం మంది రైతులకు మాత్రమే ఈ ధర దక్కింది. మిగతా రైతుల నుంచి ఏకంగా నాలుగైదు వేలు ధర తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేశారు. వ్యాపారులు సిండికేటుగా మారడంతో మిరప రైతులకు ధరాఘాతం తప్పలేదు.
Khammam Mirchi Market: మిర్చి రైతుల కష్టాలు తీరేదెన్నడు...?
విదేశాల్లో తెలుగు రాష్ట్రాల మిర్చికి మంచి ధర : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మిరపకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. కానీ ఖమ్మం మార్కెట్లో మాత్రం గిట్టుబాటు మిర్చిధర రైతులకు అందని ద్రాక్ష గానే ఉంటోంది. ఈ ఏడాది ఆరంభంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించి కొనుగోళ్లను పర్యవేక్షించారు. ఆ సమయంలో ధరలు రైతులను ఊరించినా తర్వాత పతనమవుతూ వచ్చాయి.