Real Estate Venture in the Common Man Land YSRCP Leaders Possession :తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే ఏకంగా ఆస్తి కొట్టేసేందుకు కుట్రపన్నారు. గత ప్రభుత్వంలో నేతలు కొంత మంది పోలీసు అధికారులు జత కలిసి ఈ పని చేశారు. రూ.కోట్ల విలువైన పొలాన్ని కబ్జా చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా డెవలప్‌మెంట్ పేరుతో రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే ‘శవాలు లేస్తాయ్!’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల రూ.కోట్ల విలువైన స్థిరాస్తి వివాదంలో చిక్కుకున్న ముఠా మరో కబ్జాకు తెరలేపింది.
విజయవాడ నగరం ఆనుకుని ఉన్న యనమలకుదురులో జరుగుతున్న తంతుపై బాధితుడు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా యనమలకుదురులో ఓ రౌడీమూక బెదిరింపులకు పాల్పడుతూ ఖాళీ స్థలాలు, పొలాలను ఆక్రమించి నకిలీ దస్తావేజులతో వివాదం సృష్టిస్తోంది. ఈ దందాకు కొంతమంది నేతలు ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందిస్తున్నారు.
వడ్డీ చెల్లిస్తూ వచ్చినా : విజయవాడ పటమటకు చెందిన జన్యాపుల వెంకటసుబ్బారావుకు హైదరాబాద్‌లో వ్యాపారం ఉంది. దానికి రుణం అవసరమై ప్రైవేటు వ్యక్తులను సంప్రదించారు. 2019లో విజయవాడ జేడీనగర్‌లోని తన 266 గజాల స్థలాన్ని తనఖా పెట్టి రూ.1.10కోట్లు రుణం తీసుకున్నారు. దీనికి తనఖా రిజిస్టర్ కాకుండా స్థలం అమ్మినట్లు రిజిస్టర్ చేయించారు. డబ్బు చెల్లిస్తే మళ్లీ రిజిస్టర్ చేసేలా అంగీకారం కుదిరింది.
మరికొంత అవసరమై 2021లో రూ.20లక్షలు తీసుకున్నారు. దీనికిగాను యనమలకుదురులో సర్వే నంబరు 78/2లోని 2.07 ఎకరాల భూమిలో ఎకరం భూమి సేల్‌డీడ్ రాయించుకున్నారు. ఈ రుణం మొత్తం ఏఎస్‌మోహన్ దగ్గర తీసుకుని ఆయనకే రిజిస్టర్ చేశారు. మధ్యవర్తిగా సతీష్ ఉన్నారు. మొదటి రుణానికి రూ.3 చొప్పున, తర్వాత రుణానికి రూ.10 చొప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చారు.
మేలు చేస్తానని మరింత కీడు చేశారు : తన పొలాన్ని విడిపించుకునేందుకు ఎన్నిసార్లు ఏఎస్‌మోహన్‌ను కలిసినా సరిగా లెక్క చెప్పలేదు. చివరకు రూ.4.12కోట్లు అయిందని, నగదు చెల్లిస్తేనే తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తానని మొరాయించారు. అప్పటికే జేడీనగర్ వద్ద ఓ స్థలం దాదాపు రూ.2కోట్ల విలువ చేస్తుంది. తనఖా పెట్టిన పొలం ఎకరా రూ.12కోట్లు పలుకుతోంది. తన పొలాన్ని విడిపించేందుకు వెంకటసుబ్బారావు పలువురు వ్యక్తులను ఆశ్రయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్న నాయకుడు రంగప్రవేశం చేశారు. మేలు చేస్తానని చెప్పి ఆయన మరింత కీడు చేశారు.
పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు నమోదు చేయలేదు. దీనిపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి ఒత్తిడి పెంచడంతో పోలీసులు పట్టించుకోలేదు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఒక పోలీసు అధికారి రూ.5లక్షల వరకు లంచం తీసుకుని ఓ డీఎస్పీని పంచాయితీ చేయాలని ఆదేశించారు. కంకిపాడు పోలీసుస్టేషన్‌లో పంచాయితీ నిర్వహించారు. రూ.8కోట్లు చెల్లించి పొలాన్ని నివేశన స్థలాన్ని విడుదల చేయించుకోవాలని చెప్పారు. అక్కడ అంగీకరించిన ఫైనాన్షియర్ అడ్డం తిరిగారు ‘రూ.50లక్షలు ఇస్తాం మొత్తం ఆస్తి వదిలేయాలని బెదిరింపులు ప్రారంభించారు.
ఆదిమూలపు సురేష్ భూ కబ్జా - మంత్రి లోకేశ్‌కు బాధితుల ఫిర్యాదు
మరోనేత మోసం :తన ఆస్తిని దక్కించుకునేందుకు మధ్యవర్తుల ద్వారా మరో నేతను మోహన్‌రావు ఆశ్రయించారు. దీనికి ఆ నేత మరో ప్రణాళిక రచించారు. ఫైనాన్షియర్‌కు రిజిస్టర్ చేయకముందే తనపేరు మీద విక్రయ ఒప్పందం రాసివ్వాలని సూచించారు. సుబ్బారావు అదే విధంగా రాసిచ్చారు. అనంతరం ఆ నేత సైతం అవతలి పార్టీతో కుమ్ముక్కై ఎదురు తిరిగారు. మొత్తం మీద రూ.25కోట్ల నుంచి రూ.35 కోట్ల విలువ చేసే ఆస్తిని తలా కొంచెం పంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చంపుతామంటూ హెచ్చరికలు చేస్తున్నారని మోహన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న మరో రెండు ఎకరాలను ఆ వైఎస్సార్సీపీ నేత ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.
దౌర్జన్యంగా కూల్చివేసి :యనమలకుదురు కరకట్ట పక్కనే ఉన్న 2.07 ఎకరాలను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. డెవలప్‌మెంట్ పేరుతో స్థిరాస్తి మోసాలకు పాల్పడే వ్యక్తికి అప్పగించారు. ఆయన పలు స్థలాల్లో కబ్జాలకు తెరతీసిన వ్యక్తి. పొలంలో ఉన్న గుడిసెలను దౌర్జన్యంగా కూల్చివేశారు. అక్కడ ఉండే వారిని బెదిరించి బయటకు పంపారు. పొలంలో రోడ్లు వేసి విద్యుత్తు తీగలను లాగుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరని వాపోయారు.
పొలం డాక్యుమెంట్లు అన్నీ మొదట తన దగ్గరే ఉన్నాయని మధ్యవర్తి సతీష్ చెప్పారు. వేరే వ్యక్తి దగ్గర రూ.7.5కోట్లు ఫైనాన్స్ ఇప్పిస్తానని రాజకీయ నాయకుడు తీసుకుని వారికి అప్పగించారని సతీష్ తెలిపారు. తనకు 5సెంట్లు స్థలం స్వాధీన పత్రం ఉందని, తన స్థలం ఇస్తామని మోహన్‌రావుకు మద్దతుగా ఉండవద్దని తనను హెచ్చరిస్తున్నారని తెలిపారు. అన్ని వివరాలను ఆధారాలతో సహా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుల కబ్జా పర్వంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మోహన్‌రావు కోరుతున్నారు.
'వారసత్వ భూములను కబ్జా చేశారు - ప్రశ్నిస్తే హత్యాయత్నం'