CBR Residents Received Compensation : పనిచేసే ప్రభుత్వం ఉంటే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందనేదానికి చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితుల ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. పరిహారం కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మర్రిమేకలపల్లి ఎస్సీ కాలనీ వాసులకు సంక్రాంతి కానుకగా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలను కూటమి ప్రభుత్వం ఖాతాల్లో జమచేసింది. 'నీటిలో ముంచేశారు, పరిహారం మరిచారు' అంటూ వరుస కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేసిందంటూ 'ఈటీవీ భారత్'కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లాలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను 20 ఏళ్ల క్రితం నిర్మించారు. రిజర్వాయర్‌లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వచేస్తే తాడిమర్రి మండలంలోని పలు గ్రామాలు నీట మునిగే ప్రమాదముంది. అయినప్పటికీ గత వైఎస్సార్సీపీ పాలనలో సీబీఆర్ జలాశయంలో నీటి నిల్వ పెంచి, వైఎస్సార్ జిల్లాకు లబ్ధి చేకూర్చాలని భావించి తాడిమర్రి మండలంలోని మర్రిమేకలపల్లితో పాటు పలు గ్రామాలను నీటిలో ముంచారని బాధితులు ఆరోపించారు.
ఆరు నెలల్లోనే పరిహారం : ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2022లో నేరుగా ఇళ్లలోకి నీటిని వదిలి, పోలీసులతో బెదిరించి బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారని వాపోయారు. ఇళ్లను ముంచేశారని పరిహారం కోసం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చుట్టూ తిరిగినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6నెలల్లోనే పరిహారం అందడంతో నిర్వాసితుల్లో సంతోషం వ్యక్తం చేశారు.
"నీళ్లు వచ్చినప్పుడు మొదటగా మునిగింది మా గ్రామం. దీనికోసం వెంకట్రామిరెడ్డిని కలిస్తే పరిహారం ఇప్పిస్తామని చెప్పారు అలా ప్రతి నెల చెప్పుకుంటూ ఐదు సంవత్సరాలు గడిపారు. పరిహారం కోసం కాళ్లు పట్టుకున్న అప్పటి నాయకులు స్పందింలేదు కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత మాకు మంచి చేశారు. వారికి ధన్యవాదాలు." - నిర్వాసితులు
మర్రిమేకల గ్రామాన్ని నీటిలో ముంచిన నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంతటితో ఆగలేదని ఊరిలోని వారి ఓట్లను కూడా తొలగించిందని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలో 1900 ఓట్లు ఉండగా, అక్కడ 90 శాతం మంది టీడీపీ మద్దతుదారులే కావడంతో వైఎస్సార్సీపీ నేతలు కక్షకట్టి అనేక మంది ఓట్లు లేకుండా చేశారన్నారు. దీనిపై కలెక్టర్, ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. స్పందించిన ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కేవలం ఎన్నికలకు నెలన్నర ముందు 1260 మందిని ఓటర్లలో జాబితాలో చేర్చిందన్నారు.
ఒక్కో కుటుంబంలో రూ.10లక్షలు : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈటీవీలో మరోసారి కథనం ప్రసారం చేయడంతో మంత్రి సత్యకుమార్ స్పందించారు. ప్రభుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమచేయించారు.
బ్యాంకు ఖాతాలతో ఆధార్, పాన్ కార్డు అనుసంధానం కాకపోవడం వల్ల 20మందికి పరిహారం అందలేదని నిర్వాసితులు తెలిపారు. సమస్య పరిష్కరించి, అందరికీ పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
మల్లవల్లి వైపు ప్రభుత్వం చూపు - పరిహారం అందని రైతుల ఆందోళన
పార్క్లో ప్రమాదం- మృతుడి ఫ్యామిలీకి రూ. 2,600 కోట్ల పరిహారం